దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం.. అంతం అనేదే లేకుండా సాగుతోంది. తమ దేశాన్ని ఆక్రమించి, తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేశారని పాలస్తీనియన్లు సమరానికి సిద్ధమవగా.. ఆ ప్రాంతం తమదేనని ఎదురు దాడిచేస్తోంది ఇజ్రాయెల్. ఈ విధంగా మొదలైన యుద్ధం ఏళ్లు, దశాబ్దాలు దాటుతూ కొనసాగుతూనే ఉంది. కొంత కాలం విరమించడం.. మళ్లీ యుద్ధం మొదలు పెట్టడం అనేది ఓ ప్రక్రియగా మారిపోయిందక్కడ.
దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత మరోసారి భీకర యుద్ధం కొనసాగుతోంది. పాలస్తీనా ఆందోళనకారులు ఇజ్రాయెల్ పై బాంబు దాడులు జరుపుతుండగా.. ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు జరుపుతోంది. దీంతో.. భారీగా ఆస్తినష్టం.. ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. తాజాగా జరిగిన బాంబుదాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ కు చెందినవారు ఏడుగురు మరణించారు.
సెంట్రల్ గాజాలోని చాలా అపార్ట్ మెంట్లను ఇజ్రాయెల్ దళాలు నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ లో రెండు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. ఈ దారుణ ఘటనల్లో 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం విషాదం. ఇక, గాయపడినవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు కలిపి మొత్తం 365 మంది గాయపడ్డారని గాజా హెల్త్‌మినిస్ట్రీ ప్రకటించింది.
ఈ భీకర పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. ఏ వైపు నుంచి బాంబులు దూసుకొస్తాయో..? ఈ రాకెట్ లాంఛర్ తమ ఇంటిని నేలమట్టం చేస్తుందోనని హడలిపోతున్నారు. ఈ దారుణాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. పరిస్థితిని సమీక్షించేందుకు ఇరు దేశాలతో సమావేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది. మరి, ఈ సమావేశాలు ఈ దారుణాలను ఎంత వరకు అడ్డుకుంటాయో చూడాలి.