Israel vs Hamas : ఉగ్రవాదం అది ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమే. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాందహార్ లో విమానం హైజాక్ అయ్యింది. అప్పట్లో భారత ఆధీనంలో ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టాలని హిజుబుల్ ముజాహిద్ సంస్థ డిమాండ్ చేసింది. ఉగ్రవాదుల చెరలో ప్రయాణికులు ఉండడం.. మీడియా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాదులను విడిచి పెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ఈ పరిణామాలను భారత్ చాలా కాలం పాటు చవి చూడాల్సి వచ్చింది. అప్పట్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైనిక చర్యకు అనుమతి ఇవ్వాలని భారత ఆర్మీ కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ కూడా ఇటువంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నది. అయితే ఉగ్రవాదం ఎంత విపత్తు కలిగిస్తుందో ఇజ్రాయేల్ కు తెలియంది కాదు. అందుకే హమాస్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ తీవ్రవాదుల ఆధీనంలో తమ సైనికులు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయడం లేదు.
మంగళవారం గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హమాస్ సెకండ్ ఇన్ చీఫ్ సహా ఉగ్రవాద గ్రూప్నకు నిధులు సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న పొలిట్ బ్యూరో నేత మృతి చెందారు. హమాస్ ఉగ్రవాద సంస్థకు గాజా స్ట్రిప్ ప్రభుత్వ అధినేత మహమ్మద్ డెయిఫ్ చీఫ్ గా ఉండగా.. సెకండ్ ఇన్ చీఫ్ జకారియా అబూ ముఅమ్మర్, ఆర్థిక మంత్రిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా జువాద్ అబూ షమల్లా ఉన్నారు. డెయిఫ్ తో పాటు హమాస్ సంస్థకు వీరు అత్యంత కీలక వ్యక్తులు. ము అమ్మర్ హమాస్ లకు వ్యూహ కర్తగా కొనసాగుతున్నాడు. ఉగ్రవాద సంస్థకు కావలసిన నిధులు, ఆయుధాలను సమకూర్చడంలో షమల్లాది కీలక భూమిక. మంగళవారం ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో వీరిద్దరూ చనిపోయారు. ఇజ్రాయిల్ ఈ విషయాన్ని ధ్రువీకరించినప్పటికీ.. హమాస్ తరఫున ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు. సరిహద్దుల్లో 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మరోవైపు ఇజ్రాయిల్,హమాస్, హిజ్బుల్లా వైపు మరణాలు భారీగా నమోదైనట్టు ఐడీఎఫ్, పాలస్తిన వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు శనివారం నుంచి హమాస్ జరిపిన దాడుల్లో మరణించిన పౌరుల సంఖ్య వేయికి పైగా ఉందని, ఇంకా 544 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. గాజాలో మరణాల సంఖ్య 766 గా ఉన్నట్టు హమాస్ వర్గాలు చెబుతున్నాయి. అటు లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పై దాడులు జరుపుతున్న హిజ్బుల్లా ఉగ్రవాదులకు ఐడీఎఫ్ కు మధ్య పోరులోనూ మరణాలు భారీగా ఉన్నాయని ఐడీఎఫ్ చెబుతోంది. ఇక్కడ కూడా 38 మంది సైనికులు చనిపోయారని, ఇప్పటివరకు మరణించిన ఐడిఎఫ్ బలగాల సంఖ్య 190 కి పెరిగిందని తెలుస్తోంది. హిజ్బుల్లా ఉగ్రవాదుల మరణాలు కూడా డజన్లలో ఉంటాయని సమాచారం. మరోవైపు అమెరికా సాయం ఇజ్రాయిల్ కు అందినట్టు తెలుస్తోంది. భారీ యుద్ధ విమాన వాహక నౌక మధ్యధరా సముద్రతీరానికి చేరిందని, అమెరికా నుంచి మందు గుండు సామాగ్రి సరఫరా అయిందని తెలుస్తోంది. బాగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బందీలను చంపేస్తామని హమాస్ ప్రకటించడంపై ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందించింది. గాజాలో బందీలకు ప్రాణహాని జరిగితే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరోవైపు 3 లక్షల మందితో ఏర్పాటు చేసిన రిజర్వు సైన్యాన్ని ఐడిఎఫ్ గాజా సరిహద్దుల్లో మోహరించింది. మరికొద్ది రోజుల్లో పదాతి దళాలు గాజాల ప్రవేశిస్తాయని సమాచారం అందుతోంది. విదేశాల్లో ఉన్న వందల మంది ఇజ్రాయిలీలు యుద్ధంలో పాల్గొనేందుకు మాతృభూమికి తిరిగి వస్తున్నారు.