https://oktelugu.com/

Singareni Elections : సింగరేణి ఎన్నికలు మళ్లీ వాయిదా.. నిర్వహణపై హై కోర్టు క్లారిటీ

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు వెళ్లేందుకు మొదటి నుంచీ అధికార పార్టీ అయిష్టత చూపుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2023 / 08:49 PM IST

    CM KCR On Singareni

    Follow us on

    Singareni Elections : ఆంజనేయుడి పెళ్లి ఎప్పుడంటే రేపనే చందంగా మారింది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల తీరు. వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో కార్మికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరోసారి వాయిదా పడటం కార్మికులకు మింగుడుపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం.. ఆరు జిల్లాలు, 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరగాల్సి ఉండటం, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల విధుల్లో ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 27న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

    నవంబరు చివరి నాటికే..

    నవంబరు చివరి నాటికే ఎన్నికల అధికారి అయిన కేంద్ర డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌కు ఓటర్ల జాబితా అందజేయాలని సింగరేణికి స్పష్టం చేసింది. డిసెంబరులో నిర్వహించే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తామని.. శాంతిభద్రతలను కాపాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ (అండర్‌టేకింగ్‌) హైకోర్టు రికార్డు చేసింది. తాజా ఆదేశాలతో సింగిల్‌ జడ్జి ఆదేశాలను సవరిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వస్తున్నామని, మరోసారి హైకోర్టుకు వచ్చి ఎన్నికలు నిర్వహించలేదని చెప్పవద్దంటూ చురకలు అంటించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సింగరేణి యాజమాన్యం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

    -మొదటి నుంచీ అధికార పార్టీ అయిష్టత

    అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు వెళ్లేందుకు మొదటి నుంచీ అధికార పార్టీ అయిష్టత చూపుతోంది. 2017లో సింగరేణిలోని 11 ఏరియాల్లో 9 చోట్ల గులాబీ సంఘమే(టీజీబీకేఎస్‌) విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. అయితే, ఏడాది తర్వాత 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌ ఏరియాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో మూడుచోట్ల మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలకు వెళ్తే లాభంకంటే నష్టమే ఎక్కువనే అంచనాల్లో ఆ పార్టీ ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, కీలక నేతలు వలస వెళ్లడం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.