Shivam Dube: మైదానంలో శివం దూబే చీటింగ్..? అందుకే ఎంపైర్ జేబులు చెక్ చేశాడా? అసలేమైందంటే?

చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చెన్నై ఆటగాడు శివం దుబే జేబులను ఫీల్డ్ ఎంపైర్ తనిఖీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అనిల్ చౌధురీ శివం దగ్గరికి వెళ్లి అతనితో కొంతసేపు మాట్లాడాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 3:44 pm

Shivam Dube

Follow us on

Shivam Dube: ఐపీఎల్ 17వ సీజన్లో బలమైన జట్టుగా ఎంట్రీ ఇచ్చిన చెన్నై.. మూడవ ఓటమిని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆ జట్టు మూడవ స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం ఏక్నా స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి తెలివిగా బౌలింగ్ వైపు మొగ్గాడు. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ముఖ్య ఆటగాళ్లు అవుట్ కావడంతో రవీంద్ర జడేజా, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోని కీలక ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై జట్టు 177 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చెన్నై బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలింగ్ లో పస లేకపోవడంతో లక్నో ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో చేదించారు. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని దక్కించుకున్నారు.

అయితే చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చెన్నై ఆటగాడు శివం దుబే జేబులను ఫీల్డ్ ఎంపైర్ తనిఖీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అనిల్ చౌధురీ శివం దగ్గరికి వెళ్లి అతనితో కొంతసేపు మాట్లాడాడు. అనంతరం అతడి జేబులను అత్యంత అనుమానాస్పదంగా తనిఖీ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి. ఈ ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకూ ఏ ఎంపైర్ కూడా ఆటగాళ్ల జేబులు తనిఖీలు చేయలేదు. శివం జేబులు తనిఖీ చేయడంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఆన్ ఫీల్డ్ ఎంపైర్లు ఆటగాళ్ల జేబులు తనిఖీ చేయడం అరుదుగా జరుగుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫీల్డ్ ఎంపైర్ ఎందుకు శివం జేబులు చెక్ చేశాడు అనేదానికైతే కారణాలు తెలియ రాలేదు. బంతిని మార్చేందుకు, బ్యాట్ పై ఏవైనా మార్పులు చేసేందుకు ఆటగాళ్లు ఏవైనా వస్తువులు తీసుకొచ్చారా? అని అనుమానంతో ఎంపైర్లు తనిఖీ చేస్తూ ఉంటారు. ఆటగాళ్లు కూడా ఎంపైర్ అనుమతి లేకుండా క్రీమ్స్, బబుల్ గమ్, ఆయింట్మెంట్లు, ఇతర లోషన్లు వాడడానికి వీలులేదు. కాగా, ఇటీవలి మ్యాచ్ లలో సత్తా చాటిన శివం దూబే.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

కాగా, ఎంపైర్ శివం జేబులు తనిఖీ చేయడం పట్ల చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..”అతడు అన్ని నిబంధనలు పాటించాడు. మామూలుగానే మైదానంలోకి వచ్చాడు. కానీ ఏదో విశ్వసనీయ సమాచారం తెలిసినట్టు.. అతడేవో నిషేధిత వస్తువులు తెచ్చినట్టు అంపైర్ శివం జేబులు తనిఖీ చేయడం సరికాదు. ఇవన్నీ శివం చేయకూడని పని చేసినట్టు విమర్శలు వ్యాపించేందుకు కారణమవుతాయి. ఒక్కోసారి ఎంపైర్లు ఏం చేస్తారో వారికే తెలియదనుకుంటా” అంటూ చెన్నై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.