Iran Vs Israel: హమాస్‌పై ఆరు నెలలకుపైగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ను నియంత్రించేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అమెరికా హెచ్చరికలను ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో ఇరాన్ రంగంలోకి దిగింది. అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు అణుబాంబు తయారీపై నిర్ణయం తీసుకోలేదని, కానీ, ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే తమ సైనిక విధానం మార్చుకుంటామని స్పష్టం చేశారు. తమ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ముదురుతున్న ఘర్షణ వాతావరణం..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రయెల్ బాంబింగ్ చేయడమే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణం. దీంతో వందల డ్రోన్లు, క్షిపుణులను టెల్ అవీవ్‌పైకి టెహ్రాన్ ప్రయోగించింది.
తొలగని ‘అణు’ టెన్షన్
ఇదిలా ఉంటే ఇరాన్ అణు కార్యక్రమానికి దూరం చేసేందుకు ఐఏఈఏ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సంస్థ అధిపతి రాఫెల్ గ్రూసీ ఇరాన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చశారు. చర్చలకు ఆ దేశం ఏ మాత్రం సహకరించడం లేదని పేర్కొన్నారు.గతేడాది ఇరాన్ బహిర్గతం చేయని ప్రాంతాల్లో యురేనియం అణువులు దొరికాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సహకరిస్తామని నాడు ఇరాన్ తెలిపింది. కానీ, ఆ హామీ నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సైనిక విధానం మార్చుకుంటామని సుప్రీం లీడర్ సలహాదారు ప్రకటించడం టెన్షన్ పెడుతోంది.