BAPS Hindu Mandir: తన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించారు. అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. స్వామి నారాయణ్ ట్రస్ట్ నిర్మించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ (బీఏపీఎస్) ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణం వెనుక విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ ఆలయ నిర్మాణానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 27 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఇందులో 13.5 ఎకరాల్లో ఆలయ సముదాయాన్ని నిర్మించారు. మిగిలిన భూమిని 14 వేల కార్లు, 50 బస్సులు నిలిపి ఉంచే విధంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన వాస్తు శిల్పిగా క్యాథలిక్ క్రిస్టియన్ వ్యవహరించారు. ప్రాజెక్టు మేనేజర్ గా సిక్కు వ్యక్తి పని చేశారు. ఫౌండేషన్ డిజైనర్ గా బౌద్ధ మతాన్ని అనుసరించే వ్యక్తి వ్యవహరించారు. జైన సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి డైరెక్టర్ గా పని చేశారు.
స్వామి నారాయణ్ ట్రస్టుకు సంబంధించిన పదవ ఆధ్యాత్మిక గురువు, శాఖధిపతి ప్రముఖ్ స్వామి మహరాజ్ 1997 ఏప్రిల్ లో అబుదాబిలోని ఎడారి భూముల్లో ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఈ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని, పరమత సహనాన్ని పెంపొందించేందుకు ఆలయం నిర్మిస్తే బాగుంటుందని ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని అప్పటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారు. 1997లో పుట్టిన ఆలోచన ఆలయ నిర్మాణ దిశగా కార్యరూపం దాల్చడానికి ఏప్రిల్ 2019 దాకా పట్టింది. ఏప్రిల్ 2019లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం చైర్మన్ ముగిర్ కమీష్ అల్కైలి ఆధ్వర్యంలో జరిగింది.. ఇక అప్పటినుంచి యుద్ద ప్రాతిపదికన ఆలయ నిర్మాణ పనులు జరిగాయి.
ఆలయంలో ఒంటెలు, ఒరిక్స్, ఫాల్కన్, అరబ్ దేశాల జీవన వైవిధ్యాన్ని సూచించే శిల్పాలు, అరేబియా, ఈజిప్ట్, మెసపటోమియన్ సంస్కృతిని ప్రతిబింబించే 14 రకాల ఉపమానాలను శిల్పాలుగా రూపొందించారు. మే 2023లో 30 దేశాల రాయబారులు ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. “ఆలయ నిర్మాణం బాగుంది. ఇక్కడ శిల్పాలు అత్యంత సహజంగా ఉన్నాయి. ఆ శిల్పాలలో సహనాన్ని నేను చూస్తున్నాను” అంటూ జపాన్ రాయబారి అకియో ఇసోమాటా పేర్కొన్నారంటే అక్కడి నిర్మాణశైలి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో 42 దేశాల నుంచి దౌత్యవేత్తలు అబుదాబి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించారు. “తరతరాలు నిలిచి ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భిన్నమైన విశ్వాసాలు కలిగి ఉన్న వ్యక్తులు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం గొప్ప విషయం” అని ఇంగ్లాండ్ డిప్యూటీ రాయబారి జోనాథన్ వైట్ పేర్కొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 శిఖరాలను సూచిస్తుంది. ఈ ఆలయాన్ని కూడా ఏడు శిఖరాలుగా నిర్మించారు. ఆలయం నాగార శైలిలో నిర్మించారు.. ఆలయం ముందు భాగం భిన్న సంస్కృతుల సమహారంగా ఉంది. హిందూ దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయం ఎత్తు 108 అడుగుల పొడవు. 180 అడుగుల వెడల్పుతో ఉంది. బయటి భాగాన్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన గులాబీ ఇసుకరాయితో నిర్మించారు. లోపలి భాగాన్ని ఇటాలియన్ పాలరాయితో నిర్మించారు. ఆలయంలో రెండు కేంద్ర గోపురాలు ఉన్నాయి. అవి డోమ్ ఆఫ్ హార్మోని, డోన్ ఆఫ్ పీస్.. ఇవి భూమి, నీరు,అగ్ని, గాలి, మొక్కలు.. వంటి వాటి ప్రయోజనాలను ప్రధానంగా వివరిస్తాయి.. ఆలయంలో సామరస్యం అనే పదాన్ని 30 ప్రాచీన, ఆధునిక భాషలలో రాశారు.
ఎంఈపీ మిడిల్ ఈస్ట్ పురస్కారాల్లో ఈ ఆలయం 2019 సంవత్సరపు ఉత్తమ మెకానికల్ ప్రాజెక్టుగా, 2020 సంవత్సరపు ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్ గా ఎంపికైంది. ఫిబ్రవరి 14న మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమం జరిగింది. ఆలయ సంప్రోక్షణ కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18 నుంచి భక్తులను స్వామివారి దర్శనార్థం గుడిలోకి అనుమతిస్తారు.
2 Days to go!#HistoryOfHarmony pic.twitter.com/O922wdXSKn
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) February 12, 2024