Paddy Bonus: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కీలక అంశాల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఒకటి. ఈడబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. యాసంగి పంటకు ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల వచ్చే వానాకాలం నుంచి వరికి రూ.500 బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచనలో పడింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది.
అనేక హామీలు..
అసెంబ్లీ ఎన్నిల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్, రైతులకు రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు ఆర్థికసాయంతోపాటు ధాన్యానికి రూ.500 బోనస్ కూడాఉన్నాయి. ఇవి ప్రజలు, రైతులను ఆకర్షించాయి.
పునరాలోచన..
అయితే వరి ధాన్యానికి రూ.500 బోనస్‌పై తాజాగా కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. ఈమేరకు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు చెల్లిస్తున్నందున ప్రస్తుతం బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈమేరకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఏమైందని విపక్షాలు అడుగుతున్న క్రమంలో కోందడరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం ఇలా..
ఇక ప్రస్తుతం మార్కెట్‌లో వరి క్వింటాల్‌కు రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధర రూ.2,060 ఉండగా అదనంగా రూ.500లకుపైగా చెల్లిస్తున్నారు. ధర పడిపోతే బోనస్ చెల్లిస్తామని వెల్లడించారు. దీంతో ఇక ఇప్పట్లో రైతులకు బోనస్ చెల్లించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రోజుకో పథకానికి ఎగనామం పెడుతుందని ఆరోపించారు.