US elections : అమెరికా అధికారపీఠానికి రెండడుగుల దూరంలో తెలుగు మహిళ… ఉపాధ్యక్షుడిగా ఆమె భర్త!

ఉష శాన్ ప్రాన్సిస్కో, వాషింగ్టన్ డిసి లో లిటిగేటర్ గా పనిచేస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ . జీ రాబర్ట్స్ జూనియర్, న్యాయమూర్తులు బ్రెంట్ కవనాగ్, అమూల్ థాపర్ వద్ద క్లర్క్ గా పనిచేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 16, 2024 8:40 am

, Usha Chilukuri's husband JD Vance

Follow us on

US elections : అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. నవంబర్ నెలలో ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. శనివారం అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో కలకలం నెలకొంది.. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. వెంటనే ఆయనను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ట్రంప్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు..” నన్ను రక్షించినందుకు అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ పోలీసులకు ధన్యవాదాలు. అమెరికాలో ఈ తరహా ఘటనలు మనం ఎప్పుడైనా చూసామా? శ్వేత దేశంలో ఇలా ఎందుకు జరుగుతోంది” అని వ్యాఖ్యానించారు. హత్యాయత్నం తర్వాత ట్రంప్ గెలిచేందుకు అవకాశాలు పెరిగాయని అమెరికా కేంద్రంగా పనిచేసే ఓ పోలింగ్ సంస్థ చేసిన సర్వేలో వెళ్లడైంది. అమెరికా మొత్తం సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ట్రంప్ అధికారాన్ని దక్కించుకునేందుకు మరింత బలంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పేరుకు ఆమోదం లభించింది. సోమవారం మిల్వాకిలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా భేటీ అయ్యారు. ఆయన అభ్యర్థిత్వానికి జై కొట్టారు.

, Usha Chilukuri’s husband JD Vance

ఉపాధ్యక్షుడిగా అతడు

ట్రంప్ తర్వాత ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఒహాయో సేనేటర్ జెడి వాన్స్ పేరును ట్రంప్ ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు. ఈ క్రమంలో రిపబ్లిక్ అని పార్టీ తరఫున నవంబర్లో జరిగే ఎన్నికలకు కీలక నేతల అభ్యర్థిత్వాలు మొత్తం ఖరారయ్యాయి.. జెడి వాన్స్ అమెరికాకు మెరైన్ విభాగంలో సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. యేల్ లా యూనివర్సిటీ నుంచి కూడా పట్టాను పొందారు. యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి ప్రచురితమయ్యే జర్నల్ కు సంపాదకుడిగా ఉన్నారు. ఆయన “హిల్ బిల్లీ ఎలేజ్” అనే పుస్తకాన్ని రచించగా.. అత్యధికంగా అమ్ముడు పోయిన బుక్ గా అది ఘనత సృష్టించింది. అంతేకాదు ఆ పుస్తకం ఆధారంగా ఒక సినిమా కూడా రూపొందింది. సాంకేతిక, ఆర్థిక రంగాలలో వాన్స్ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు.. ఇదే విషయంపై ట్రంప్ కూడా తన సామాజిక మాధ్యమం “ట్రూత్ సోషల్” లో రాసుకొచ్చారు.. వాన్స్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. 2022లో సెనెట్ కు ఆయన ఎంపికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శించేవారు. ఆ తర్వాత ఆయనకు విధేయుడిగా మారారు. శనివారం పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రాంతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫునుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.

కఠిన పరిస్థితుల నుంచి..

వాన్స్ ను చిన్నప్పుడే తండ్రి వదిలేసాడు.. తల్లి మాదకద్రవ్యాలకు బానిస అయ్యింది. దీంతో వాన్స్ ను ఆయన తాత పెంచేవారు. ఆర్థికంగా ఇబ్బంది ఎదురైనప్పటికీ.. పలు ప్రాంతాలలో పని చేసి చదువు కొనసాగించాడు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. రచయిత గానూ గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచాడు. వాన్స్ ఈ స్థాయిలో ఘనత సాధించడం వెనక ఆయన భార్య చిలుకూరి ఉష ఉంది.

తెలుగు మహిళతో వివాహం

రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన జేడీ వాన్స్ అమెరికాలో స్థిరపడిన తెలుగు మహిళ చిలుకూరి ఉషను వివాహం చేసుకున్నాడు.. వాన్స్ 2010లో యేల్ లా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఉష అతనికి పరిచయమైంది. అది కాస్త స్నేహంగా మారింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వారిద్దరు డేటింగ్ చేశారు.. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది వాన్స్, ఉషా దంపతులకు ఇవాన్, వివేక్, మిరా బెల్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఉష ప్రచారాన్ని అసలు ఇష్టపడరు. 2022లో వాన్స్ సెనెట్ గా పోటీ చేసినప్పుడు ఉష ప్రచారంలో పాల్గొన్నారు. భర్త విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు..” అంకితభావం కలిగిన నా భార్యను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ఆమె ప్రతి విషయం లోనూ నాకు తోడుగా ఉంది. ఆమెలో అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంది.. దానిని చూసి నేను ప్రతిసారి స్ఫూర్తి పొందుతుంటానని” సెనెటర్ గా గెలిచిన తర్వాత వాన్స్ తన భార్య గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చాడు..ఉష శాన్ ప్రాన్సిస్కో, వాషింగ్టన్ డిసి లో లిటిగేటర్ గా పనిచేస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ . జీ రాబర్ట్స్ జూనియర్, న్యాయమూర్తులు బ్రెంట్ కవనాగ్, అమూల్ థాపర్ వద్ద క్లర్క్ గా పనిచేశారు.