Trump statement: కుక్కతోక వంకర.. దానిని సీదాగా ఉండానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మళ్లీ వంకరే తిరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుద్ధి కూడా కుక్కతోకలాగే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు భారత్‌పైనే పడుతున్నాడు. తాజాగా భారత్‌పై వాణిజ్య రీతిలో మరోసారి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్–భారత్ యుద్ధం ఆపకున్నా ఆపానని చెప్పుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోయినా భారత్ ఆపేసిందని చెప్పుకున్నాడు. ట్రంప్ ఫోన్ చేయకపోయినా.. ఫోర్ చేశాడని ప్రచారం చేసుకుంటున్నాడు. అన్నీ విఫలం కావడంతో మరోమారు ఉక్రెయిన్–రష్యా యుద్ధం నడుస్తున్న సమయంలో కూడా ఆయన రష్యాతో వ్యాపార బంధాలను కొనసాగించే దేశాలపై కఠిన చర్యలు తీసుకునే సంకేతాలు ఇస్తున్నారు.
దౌత్య మార్గానికే భారత్ ప్రాధాన్యం..
న్యూఢిల్లీలోని అధికార వర్గాలు ఇప్పటికే ట్రంప్‌తో ఎలాంటి తాజా చర్చ జరగలేదని స్పష్టం చేశాయి. భారత్ తరపున ఇది సాధారణంగా అనుసరించే దౌత్య మార్గం. స్పష్టత ఇవ్వడం ద్వారా అనవసర ఉద్రిక్తతలు తగ్గించడం. అదే సమయంలో రష్యా నుంచి ఎనర్జీ దిగుమతులను తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడం వంటి అంశాలను మౌనంగా సమీక్ష చేసే అవకాశం ఉంది.
అమెరికా రాజకీయ ఉద్దేశాలు
ట్రంప్ హెచ్చరికలు కేవలం విదేశాంగ అంశం మాత్రమే కాకుండా అమెరికా అంతర్గత రాజకీయ అవసరాలకూ సంబంధించినవి. దేశీయ రాజకీయ విమర్శల నడుమ ఆయన ‘అమెరికా ప్రయోజనాలను కాపాడే నాయకుడు‘ అని చూపించేందుకు భారత్‌పై కఠిన స్వరాన్ని ఎంచుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత–అమెరికా వాణిజ్య భవిష్యత్తు
టారిఫ్ బెదిరింపులు వాస్తవానికి అమలులోకి రాకపోయినా, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై ఒత్తిడి కలిగిస్తోది. అత్యుత్తమ సాంకేతిక, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం కోరుకునే భారత్, దౌత్య సమతౌల్యాన్ని కొనసాగించడమే కాకుండా, ‘స్ట్రాటెజిక్ ఆటానమీ‘ సూత్రాన్ని పాటించే ప్రయత్నం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ట్రంప్ శైలిలో దౌత్యం ఎప్పటికీ సూటిగా ఉండదు. ఆయన వ్యాఖ్యలు తక్షణ మార్పులు తెచ్చేలా కనిపించకపోయినప్పటికీ, అవి ప్రపంచ రాజకీయ గమనాన్ని ప్రభావితం చేస్తాయి. భారత్‌కి ఇది వాణిజ్య జాగ్రత్తలతోపాటు దౌత్య పరంగా పరీక్షగా నిలుస్తుంది.