Maldives: మన పొరుగు దేశం, పర్యాటక దేశం మాల్దీవుల నుంచి భారత సైన్యం ఉప సంహరణ ప్రక్రియ పూర్తయింది. చివరి బ్యాచ్ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవులు అధ్యక్షుడు మహమ్ముద్ ముయిజ్జు కార్యాలయం అధికార ప్రతినిధి తెలిపారు. భారత బలగాలు మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ముయిజ్జు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి ఒకరోజు ముందే భారత సిబ్బంది ఆ దేశం వీడి స్వదేశానికి బయల్దేరినట్లు సమాచారం.
హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలు..
మాల్దీవుల్లో హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన సైనిక సిబ్బంది తొలి విడతగా మార్చి రెండో వారంలో స్వదేశానికి వచ్చేశాయి. ఏప్రిల్‌లో రెండో బ్యాచ్‌కు చెందిన సైనికులు వెనక్కి వచ్చేశారు. అయితే మొత్తం ఎంత మంది వెళ్లిపోయారనేది మాల్దీవులు వెల్లడించడం లేదు. మొత్తం 89 మంది భారతీయ సైనికులు తమ దేశంలో ఉన్నట్లు గతంలో అధికార దస్త్రాలను ఉటంకిస్తూ తెలిపింది. మొదటి, రెండో విడతల్లో 51 మంది వెళ్లిపోయినట్లు పేర్కొంది.
రెండు దేశాల మధ్య పెరిగిన దూరం..
మాల్దీవులు అధ్యక్షుడిగా ముయిజ్జు అధికారం చేపట్టాక భారత్, మాల్దీవులు మధ్య దూరం పెరిగింది. తమ దేశంలో విధులు నిర్వహిస్తోన్న భారత బలగాలు మే 10వ తేదీ నాటికి వెనక్కి వెళ్లిపోవాలని సూచించింది. ఆ తర్వాత ఆ దేశానికి చెందిన ఒక్క మిలటరీ సిబ్బంది ఊడా తమ భూభాగంలో ఉండకూడదన్నారు. అయితే తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు ఢిల్లీ చేపట్టిన షరతులను మాల్దీవులు అంగీకరించింది. దీంతో ఇప్పటికే భారత సైనిక బృందం మాల్దీవులుకు చేరుకుంది.