Homeఅంతర్జాతీయంTaiwan : ఇదేందయ్యా ఇదీ.. ప్రియుడి ఆత్మతో పెళ్లా? మరి కాపురం ఎట్లా.. మేమెప్పుడు చూడలే...

Taiwan : ఇదేందయ్యా ఇదీ.. ప్రియుడి ఆత్మతో పెళ్లా? మరి కాపురం ఎట్లా.. మేమెప్పుడు చూడలే ఈ వింత?

Taiwan : ప్రేమంటే తప్పొప్పులతో నిమిత్తం లేకుండా ఒక వ్యక్తిని యధాతధంగా అంగీకరించడం.. కానీ ఈ రోజుల్లో ప్రేమ అలా లేదు. ప్రే అంటే ప్రేమించడం.. మ అంటే మర్చిపోవడం అన్నట్టుగా మారిపోయింది. నచ్చితే ఇష్టపడటం.. కుదిరితే ప్రేమించడం.. అన్ని బాగుంటే శారీరకంగా కలవడం.. అభిప్రాయ భేదాలు వస్తే కటీఫ్ చెప్పుకోవడం సర్వసాధారణమైపోయింది. పైగా డేటింగ్, లివింగ్ రిలేషన్ వంటి పాశ్చాత్య ధోరణులు పెరిగిపోవడంతో ప్రేమ అనే పదానికి అర్థం మారిపోయింది. దీంతో కలకాలం నిలిచి ఉండాల్సిన ప్రేమ కాస్త ఇన్ స్టంట్ కాఫీ లాగా మారిపోయింది. అయితే ఇలాంటి ఈ రోజుల్లో ఓ యువతి చేసిన పని ప్రేమపై నమ్మకాన్ని పెంచుతోంది. ప్రేమ అనే రెండు అక్షరాల పదాన్ని కాపాడుకునేందుకు ఏదైనా చేయొచ్చు.. ఎంత దాకైనా వెళ్లొచ్చు అనే నమ్మకాన్ని కలిగిస్తోంది..

తైవాన్ దేశంలో యు అనే ఒక యువతి ఉంది. ఆమె సంవత్సరాలుగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. వారిద్దరు చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను తర్వాత స్థాయికి తీసుకెళ్ళేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. జీవితంలో స్థిరపడ్డారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు సమ్మతం తెలిపారు. ఒక మంచి రోజు చూసుకుని పెళ్లి చేసుకోవాలని వారిద్దరు, ఇరు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. కానీ ఈ లోగానే ఈనెల 15న జరిగిన ఒక కారు ప్రమాదం ఆ యువకుడిని బలి తీసుకుంది. ఆ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.. ప్రియుడు చనిపోవడంతో యు గుండె ముక్కలైంది. రోజుల తరబడి ఏడ్చింది. అతడి గదిలో .. అతని జ్ఞాపకాలలో కన్నీరు మున్నీరయింది. చివరికి ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది.

జూలై 15న జరిగిన కారు ప్రమాదంలో తన ప్రియుడు చనిపోవడంతో యు అతడి ఆత్మను వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. జూలై 15న జరిగిన ప్రమాదంలో ముగ్గురిని రక్షించిన యు.. తన ప్రియుడిని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఆనాటి నుంచి యు తీవ్ర మనోవేదనకు గురైంది. అతనిపై ఉన్న ప్రేమను చంపుకోలేక అతడి ఆత్మను వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల తన ప్రియుడి తల్లిని కూడా చూసుకోవచ్చనే భావన ఆమెను ఈ దిశగా నడిపిందని స్థానిక మీడియా రాసుకో వచ్చింది. అయితే ఈ వివాహంలో యు ప్రియుడి దుస్తులు, ఇతర వస్తువులను వినియోగించనున్నారు. పూర్తిగా క్రైస్తవ పద్ధతిలో ఈ వివాహం జరగనుంది. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపేందుకు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం నెట్టింట చర్చకు దారి తీయడంతో.. యు గురించి శోధించే వారి సంఖ్య పెరిగింది. అయితే తన ప్రియుడు చనిపోయినప్పటికీ.. అతడి ఆత్మను పెళ్లి చేసుకోవాలని యు నిర్ణయించుకోవడాన్ని చాలామందిని నెటిజన్లు అభినందిస్తున్నారు. “మీ ప్రియుడు చనిపోయినప్పటికీ.. అతని జ్ఞాపకాలను మీరు మర్చిపోలేదు. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు మీరు తీసుకున్న నిర్ణయం చాలామందిని ప్రభావితం చేస్తుంది. తదుపరి ఏమిటి అనేది పక్కనపెట్టి మీకు నచ్చిన వ్యక్తి మీ పక్కనే ఉన్నాడని భావించి.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించండి అంటూ” నెటిజన్లు యు కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరేమో ప్రియుడు ఆత్మతో పెళ్లి చేసుకున్నప్పుడు.. కాపురం ఎలా చేస్తారు.. ఇలాంటి వింత మేమెప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version