Oxygen Level : ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ రోజురోజుకు పెరిగిపోతోంది. అడవుల స్థాయి కూడా క్రమేపీ తగ్గుతోంది. వాతావరణంలో మార్పులు అనివార్యమవుతున్నాయి. వాతావరణం లోకి విషవాయువులు వెలువడుతుండడంతో రుతువులు గతి తప్పుతున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్నా మార్పులు అనేక కష్టాలకు, నష్టాలకు కారణమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొరకు మాత్రమే రంధ్రం పడుతుందని.. అధిక వర్షపాతం లేదా భారీగా ఎండలు నమోదవుతాయని మాత్రమే మనకు తెలుసు. అటువంటి పరిస్థితులను స్వయంగా చవిచూస్తున్నాం కూడా.. కానీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల మరో ముప్పు ముంచుకొస్తోంది. అది మానవజాతి అంతానికి కారణం కానుంది.
వేగంగా తగ్గిపోతోంది
పారిశ్రామికీకరణ వల్ల భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది పెరగడం వల్ల హిమానీ నదాలు, మంచు ఫలకాలు గతంలో ఎన్నడూ లేనంత విధంగా కరిగిపోతున్నాయి. ఇవి కరిగిపోవడం వల్ల సముద్ర జలాల మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తీర ప్రాంత నగరాలు ముంపు ముంగిట నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే కార్బన్ డై ఆక్సైడ్, మీథెన్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు అధిక స్థాయిలో విడుదల అవుతున్న నేపథ్యంలో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల జీవకోటి మనగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిణామాలు మాత్రమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల భూమిపై ఉన్న నీటి వనరుల్లో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. “నీటి వనరుల్లో ఆక్సిజన్ క్రమేపీ తగ్గడం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. భూగ్రహంపై ప్రాణవ్యవస్థ, ఆవరణ వ్యవస్థ అతిపెద్ద మప్పులను ఎదుర్కొంటాయి. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి వనరుల్లో ఆక్సిజన్ తగ్గడం ఆందోళన కలిగిస్తోందని” అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి వనరుల్లో తగ్గుతున్న ఆక్సిజన్ స్థాయిపై తాము చేసిన అధ్యయన ఫలితాలను సైన్స్ అలర్ట్ జర్నల్ లో వారు ప్రచురించారు..
ఇంతటి ఉత్పాతానికి ప్రధాన కారణం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, కర్బన ఉద్గరాలు కారణమని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. “నీటి జలాల్లో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటే.. దానిపై ఆధారపడి జీవించే జీవులకు ఇది పెను ప్రమాదమని” శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వనరుల్లో ఆక్సిజన్ కరిగి ఉంటుంది. దానిని పీల్చుకొని జీవులు మనగడ కొనసాగిస్తాయి. అయితే ఇందులో ఆక్సిజన్ తగ్గడం వల్ల మనుషులు, జంతువుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయం కోసం ఇటీవల రసాయనాలు ఎక్కువగా వినియోగిస్తుండడం, పారిశ్రామిక వ్యర్ధాలు వివిధ రూపాలలో నీటిలో కలవడం, సేంద్రియ పదార్థాలు కలిసి నీరు కలుషితం కావడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగి ఆక్సిజన్ స్థాయి పడిపోతే.. సూక్ష్మజీవులు కూడా అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఈ భూమి మీద మనుషులు మనుగడ సాధించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించి, చెట్లను పెంచడమే ఇందుకు ప్రత్యామ్నాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ” పారిశ్రామికీకరణలో వెలువడే ఉద్గారాలను చాలావరకు తగ్గించాలి. ఎకో ఫ్రెండ్లీ విధంగా పారిశ్రామిక పాలసీ రూపొందించాలి. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్యకారకాలను గాల్లోకి వెలువరించడం తగ్గించాలి. అప్పుడే ఈ భూమి మీద మనుషులు మనుగడ సాగించేందుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడుతుంది. నీటి వనరుల సంరక్షణ కూడా సమర్థవంతంగా జరిగితే ఆక్సిజన్ స్థాయి క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఏర్పడుతుందని” శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.