Bangladesh : బంగ్లాదేశ్ లో మరోసారి అశాంతి చెలరేగింది. ఆ దేశంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్ల కోటాను నిరసిస్తూ ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మృతిచెందడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పాఠశాలలు, కళాశాలలను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధంలో పాల్గొన్న వీరుల కుటుంబ సభ్యులకు కొన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు చాలా రోజుల నుంచి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు, మహిళలకు, జాతి మైనార్టీలకు కొన్ని ఉద్యోగాలు రిజర్వ్ కాగా, యుద్ధ వీరులకు కూడా రిజర్వేషన్ కోటా కల్పిస్తున్నారు. ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వివక్షతో కూడుకుందని, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ బంగ్లాదేశ్ లో వినిపిస్తుంది.
ఈ ఉద్యమానికి మద్దతుదారులు, వ్యతిరేకులుగా రెండు వర్గాలు చీలిపోయాయి. దీంతో విద్యార్థి సంఘాలు ఇటుకలు, కర్రలతో దాడులకు దిగాయి. వందలాది మంది గాయపడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఆందోళనల్లో హింసకు పాలక అవామీలీగ్ విద్యార్థి విభాగం బీసీఎల్ కారణమని రిజర్వేషన్ల కోటా వ్యతిరేక విభాగం ఆరోపిస్తోంది. ఈ విభాగం నేతలే విద్యార్థులను చంపారని, ఇందులో బాధితులను కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోలేదని మండిపడింది.
అగ్గిరాజేసిన తాజా ఆదేశాలు
బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వేతనాలు ఉంటాయి. అయితే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రిజర్వ్ ప్రాతిపాదికనే భర్తీ చేస్తారు. దీంతో నాలుగోసారి గత జనవరిలో అధికారంలోకి వచ్చిన హసీనా ప్రభుత్వంపై ఈ రిజర్వేషన్లను తొలగించాలని ఒత్తిడి పెరిగింది. 2018లోనే ఈ రిజర్వేషన్లను హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. కానీ స్థానిక కోర్టు రిజర్వేషన్లను పునరుద్ధరించాలని తీర్పునిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు పెరిగాయి.
ఈ ఆందోళనల్లో చిట్టగాంగ్ లో ముగ్గురు, ఢాకాలో ఇద్దరు, రంగ్ పూర్ లో ఒకరు బుల్లెట్లు తాకి మృతి చెందారు. దీనిని అధికార యంత్రాగం ధ్రువీకరించింది. ఇందులో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే ఈ ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీనే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి ప్రతిపక్షపార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆందోళనలు వద్దని విద్యార్థులు తమ వాదనను కోర్టులో వినిపించాలని మంత్రి హక్ కోరారు. అయితే ప్రతిపక్ష బీఎన్సీ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. దీనిని ప్రతిపక్ష నాయకుడు రుహుల్ కబీర్ రిజ్వీ తప్పుబట్టారు. విద్యార్థులను బెదిరింపులకు గురిచేసేందుకే పార్టీ కార్యాలయంపై ప్రభుత్వం దాడులు చేయించిందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోటాను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి హసీనా చేసిన కామెంట్లు కూడా అగ్గికి ఆజ్యం పోశాయి.
ఆందోళనకారులను రజాకార్లుగా పేర్కొనడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘం దాడికి ఇది ఊతమిచ్చిందని పలువురు ఆందోళనకారులు తెలిపారు. అయితే హసీనా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మంత్రులు తెలిపారు. రజాకార్లు అనలేదని చెప్పుకొచ్చారు. ఇక ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలను రంగంలోకి దించారు. ఆందోళనల కారులపై దాడి తగదని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ చెప్పినట్లు ఆయన ప్రతినిధి స్టెఫాన్ వెల్లడించారు. అయితే తమ డిమాండ్లు నెరవెరే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని విద్యార్థులు ప్రకటించారు. ప్రభుత్వం మాత్రం ఆందోళనలతో ప్రయోజనం ఉండదని, తాము శాంతిని కోరుకుంటున్నట్లు చెబుతున్నది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: In bangladesh the agitations are protesting the reservation quota for filling jobs in colleges
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com