https://oktelugu.com/

Modi – Biden : ఆయ్ ఎట్లున్నరు.. ఆంధ్రా యాసలో మాట్లాడుకున్న మోడీ-బైడెన్

Modi – Jobiden : ” కుర్చీలో కూర్చుని కూనిరాగం తీస్తూ ఖుషీగా ఉన్న బైడెన్ని చూసి చిరునవ్వుతో పలకరించారు అప్పుడే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన మోడీజీ.. “బావగారేంటో మంచి కులాసాగా ఉన్నారు శనివారం సెలవనా..? అందులోనూ మా కోడూరోరి కుర్రాడు రాజమౌళి తీసిన ట్రిపులార్ సినిమాలో పాట.. దగ్గరుండి మరీ ఆస్కారిప్పించేరుగా.. ” బైడెన్ అగ్గగ్గలాడుతూ కుర్చీలోంచి లేచి ఎదురెళ్ళి మోడీగారికి స్వాగతం పలికారు.. “రండ్రండి బావగారూ.. మీ కోసమే మా తెల్లిల్లు మొత్తం ఎదురుచూస్తున్నారు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2023 / 05:39 PM IST
    Follow us on

    Modi – Jobiden : ” కుర్చీలో కూర్చుని కూనిరాగం తీస్తూ ఖుషీగా ఉన్న బైడెన్ని చూసి చిరునవ్వుతో పలకరించారు అప్పుడే వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన మోడీజీ..
    “బావగారేంటో మంచి కులాసాగా ఉన్నారు శనివారం సెలవనా..? అందులోనూ మా కోడూరోరి కుర్రాడు రాజమౌళి తీసిన ట్రిపులార్ సినిమాలో పాట.. దగ్గరుండి మరీ ఆస్కారిప్పించేరుగా.. ”
    బైడెన్ అగ్గగ్గలాడుతూ కుర్చీలోంచి లేచి ఎదురెళ్ళి మోడీగారికి స్వాగతం పలికారు..
    “రండ్రండి బావగారూ.. మీ కోసమే మా తెల్లిల్లు మొత్తం ఎదురుచూస్తున్నారు.. రండి ఈ టేకుకుర్చీలో కూర్చోండి.. మొన్నే బర్మా నుంచి దింపేం..” అని చేతుల్లో ఉన్న సంచుల్ని బల్లమీద పెట్టి ఆత్మీయంగా కూర్చోబెట్టారు కుర్చీలో..
    “అవునూ, లోపలికొస్తూ ఇందాకేంటీ అన్నారు.. కోడూరి వారి కుర్రాడా.. హ్హ హ్హ.. చంపీసేరు.. మీరు మరీ హాస్యం బాగారూ.. అన్నీ పండిపోయిన నడివయసు రాజమౌళ్ని పట్టుకుని కుర్రాడు అంటారేంటండీ బాబూ చోద్యంగాపోతే..!!” అని భళ్ళున నవ్వుతూ కిచెన్ వైపు చూసి
    “ఇదిగో.. ఎవరొచ్చారో చూడు.. రాత్రి నుంచి తెగ కలవరించావ్ కదూ.. మా మోడీ అన్నయ్యొస్తారు, బోలెడన్ని అప్పచ్చులు తెస్తారు అని.. అవన్నీ ఎందుకూ మనకి అని చెప్తే వినవ్.. హ్హి హ్హి.. ఏవిటో చాదస్తం.. ఇంతకీ ఆవకాయ జాడీలెక్కడా కనబడట్లేదేంటీ బాగారూ.. కార్గోలో వేసేరాండీ..??” అన్నారు బైడెన్ అన్నివైపులా చూస్తూ..
    “లేదండీ.. మా నిర్మలమ్మ మొన్నే కూతురి పెళ్ళి బెంగుళూరులో జేసింది..
    ఏసంకాలం లగ్గం అయ్యేసరికి దగ్గరోళ్లతో కానిచ్చేద్దాంలే అన్జెప్పి సింపుల్గా లాగించేసాం.. ఆ తర్వాత తద్దిలూ గట్రా తీర్చడంలో పడి హడావుడి అయిపోయింది..
    ఇంకోపక్కేమో తొలకరి ఇంకా రానేలేదు, అప్పుడే ఆషాఢం వచ్చి పడిపోయింది.. వియ్యాలోరికి ఆషాఢం కావిడి అంపేటప్పుడు ఆవకాయ పెట్టించమంటారాండీ అనడిగితే ఆనవాయి లేదన్నారంటండి అటేపువాళ్ళు..
    పోన్లే మనకే మంచిది, చాకిరీ తప్పుద్ది అని ఊరుకున్నాం మనం కూడా..
    ఆ తర్వాత గుర్తొచ్చింది అవును మనకి అమ్రికా ప్రయాణం ఉంది గదాని.. ఇంకేం జేస్తాం.. నువ్వేం కంగారడకమ్మా నా పుఱాకులు నేను పడతాన్లేనని నిర్మలమ్మకి ధైర్యం జెప్పి ఎఫ్బీలో మనకి తెల్సినోళ్ళుంటే ఆళ్ళ దగ్గర ఆర్డరిచ్చి ఆర్టీసీకి డెలివరీ ఇవ్వమని పట్టుకొచ్చేనండి.. యిందా.. ఈ పచ్చడిప్యాకెట్లు ఫ్రిజ్జులో జాగ్రత్తగా పెట్టించండి.. నూనె కారిపోతే ఫ్రిజ్జు పాడైపోద్ది.. ”
    “హ్హి హ్హి.. అయ్యో ఎందుకు బాగారూ అంత ఇబ్బందిపడటం..? ఈసారికి ఊరుకోవాల్సింది కదండీ.. ఇక్కడే యే ప్రియాపచ్చళ్ళతోనో సరిపెట్టేసుకునేవాళ్ళంగా..” నొచ్చుకున్నట్టు అన్నారు బైడెన్..
    “అమ్మమ్మమ్మా.. ఎంతమాట బావగారూ… ఇంకేమన్నా ఉందా.. ఈసారి ఎండలు గట్టిగా ఠారెత్తిచేసినియ్యిగానండీ.. లేదంటే ఆవకాయ, మాగాయి అన్నీ పదేసి జాడీలు పెట్టించుకునొద్దాం అనుకున్నాం నేనూ, మీ అమిత్ బావగారూను.. కానీ వాతావరణం దెబ్బేస్సింది..” మోడీ ఆప్యాయంగా అన్నారు బైడెన్ చేతులు పట్టుకుని ఊపుతూ..
    “మామూలు ఎండలు కాదని మెల్లగా అంటారేంటండీ బాబూ.. మొన్న విమానం దిగి కారెక్కేలోపులో కోటు మొత్తం తడిసిపోయింది నాకయితే..
    ఇంత వేడిలో జనాలెలా బతుకుతారా అని కంగారొచ్చేసింది.. మీరేమో మాగాయ పచ్చళ్ళంటన్నారు.. ఇప్పుడు ఎవరికీ తొక్కు తీసి మగ్గబెట్టడానికి టైమూ లేదు, అంత ఓపికా లేదు.. నువ్వులనూనెతో పచ్చళ్లెట్టడానికి మనరోజులేంటండీ ఇవీ…” బైడెన్ నిరాశగా పలికారు దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ..
    “బాగా జెప్పేరు.. ఎండ ఎక్కాకా నువ్వులు కుమ్మితే నూనెలో పోషకాలు ఆవిరిఐపోతాయని తెల్లారగట్లే లేచి నువ్వులు కడిగేసి గానుగ తిప్పేసేవారు మన చిన్నప్పుడు.. ఇప్పుడు ఎక్కడ జేత్నారండీ అంత శ్రద్ధగా.. ఎవరి వంటగదిలో చూసినా తౌడునూనె ప్యాకెట్లే గదేంటీ..!!”
    “అంతేఅంతేండి.. గానుగలో వేసిన నువ్వుగింజ వేగంగా వేడితో పేలడం కన్నా నిదానంగా నలగడం మంచిదని మా జాక్ మామ్మ నాకు చిన్నప్పుడు నలుగు పెట్టినప్పుడల్లా చెప్తూఉండేది పోయి ఎక్కడుందోగానీ.. అయితే అది ఎద్దుని తిప్పే రౌతునిబట్టి కూడా ఉంటాదంటలెండి..!!”
    “రౌతంటే గుర్తొచ్చిందండోయ్.. రౌత్ అని మా దగ్గర ఓ దర్శకుడున్నాడు.. మహా గొప్ప పనిమంతుడులెండి.. ఆ రౌతుగారొచ్చి ఈమధ్యనే ఉప్పలపాటోరి బాహుబలిని పెట్టి రామాయణంలాంటిది తీసి దేశంమీదకి వొదిలితే, అది యే యుగానికి చెందిన పురాణమో తేల్చుకోడానికి మొదటిరోజునే క్యూలు కట్టేసేరు మా జనాలు.. ఇంతకీ మీరు చూసేరా ఆ సినిమా.. ” మోడీజీ ఆరా తీశారు..
    “ఏంటదీ రామాయణమాండీ..?? మరి మావాళ్ళేంటీ, దాన్ని అమరేంద్ర బాహుబలి ప్రీక్వెల్ అనుకుని మూడుసార్లు చూస్సేరు.. ” హతాశుడయ్యాడు బైడెన్..
    “మావోళ్ళూ అంతే.. అభిమానం అలాంటిది.. మామూలు డిప్పం దగ్గర్నుంచి మీడియా టైకూన్ల దాకా మామూలుగా ఉండవండి మావోళ్ళ అభిమానాలు.. అంతెందుకూ..
    మొన్న.. మెగా కోడలుగారి ప్రసవానికి మా మీడియావాళ్ళు నెప్పులు పడ్డార్లెండి రాత్రి తెల్లవార్లూ.. అలా ఉంటాది మావోళ్ళ అభిమానం..”
    “మీ వాళ్ళు చాలా నయమండీ.. అక్కడితో ఆగారు..” బైడెన్ చప్పరించేశారు చాలా తేలిగ్గా..
    “ఏమండీ..” మోదీజీ ఆసక్తిగా చూశారు..
    “మీవాళ్ళు కాబట్టి బయటే కాపలా కాశారు.. మా వైపు అయితే మన పేణాలు పోయేదాకా కార్లేసుకుని మరీ వెంటబడిపోతారు..”

    (ఇది కేవలం పొలిటికల్ సెటైర్.. నవ్వుకోవడానికి మాత్రమే.. వేరే ఉద్దేశం లేదు..)