Katalin Novak: బిల్కిస్ బానో.. 2002 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ ఘటనకు పాల్పడిన నిందితులు జైలుకు వెళ్లారు. అక్కడ వారు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం ఆ నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీనిని సవాల్ చేస్తూ బిల్కీస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టడంతో బిల్కిస్ బానో కేసులో నిందితులు మళ్లీ జైలుకు వెళ్లారు. అయితే ఈ వ్యవహారంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ తప్పయిందని ఒప్పుకోలేదు. ఇలాంటి పాలకులున్న మన దేశంలో.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. విలువలు కాపాడుతున్నామని చెప్పుకుంటున్న మన నాయకులకు ఓ చిన్న దేశం ఆదర్శంగా నిలుస్తుంది. ఆ దేశ అధ్యక్షురాలు చేసిన పని ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చేతల్లో చూపించింది.
ఆ దేశం పేరు హంగరి. యూరోపియన్ యూనియన్ లో అత్యంత చిన్న దేశం. దాని జనాభా కోటి మంది కంటే తక్కువగా ఉంటారు. అలాంటి ఈ దేశం ప్రజాస్వామ్యపరంగా అతిపెద్ద దేశాలైన అమెరికా, భారత్ కు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చేతుల్లో చూపిస్తోంది. ఈ దేశ అధ్యక్షురాలుగా ప్రస్తుతం కేటిలిన్ నోవక్ కొనసాగుతున్నారు. 38 సంవత్సరాల వయసు ఉన్న ఈమె.. అత్యంత సమర్థవంతమైన అధ్యక్షురాలిగా పేరుగడించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను ఆదుకున్నారు. ఆమె చూపిన సేవా నిరతి వల్లే రెండవసారి కూడా అధ్యక్షురాలయ్యారు. హంగరిలో పేదరికాన్ని తగ్గించినందుకు ఐక్యరాజ్యసమితి ఆమెను ప్రత్యేకంగా అభినందించింది. ఇంత ఘనత సాధించినప్పటికీ ఆమె ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు. ప్రలోభాలకు కూడా దూరంగా ఉంటారని సమాచారం. అయితే ఇటీవల ఆమె తీసుకున్న ఒక నిర్ణయం హంగరీ దేశం లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమె దానికే కట్టుబడి ఉండటం విశేషం.
హంగరీ దేశంలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తనకు ప్రాణ భిక్ష ప్రసాదించాలని అధ్యక్షురాలిగా ఉన్న కేటలిన్ ను అభ్యర్థించాడు. అయితే అతడి పరిస్థితి చూసి చలించి పోయిన కేటలిన్ అతడి ఉరిశిక్షను రద్దు చేశారు. జైల్లో ఉండాలని మాత్రం ఆదేశించారు. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మరణశిక్ష రద్దు చేయడం పట్ల కేటలిన్ పై అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. వీధుల్లోకి వచ్చి వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేటలిన్ పదవికి రాజీనామా చేశారు. చదువుతుంటే ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. వేలకోట్ల కుంభకోణాలు, కట్టిన ప్రాజెక్టుల్లో పగుళ్లు, అవినీతి ఆరోపణలు, అత్యాచార ఉదంతాలు ఎదుర్కొంటూ.. పదవులను అలానే అంటిపెట్టుకుంటూ.. పెత్తనం చెలాయిస్తున్న నాయకులు కేటలిన్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి.. అన్నట్టు తన రాజీనామాకు ముందు కేటలిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ” ఈ దేశ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకున్నాను అని అర్థమైంది. నేను ఒక వ్యక్తికి ప్రాణ భిక్ష పెడుతున్నానని మాత్రమే అనుకున్నాను. ఇందులో నాకు వేరే ఉద్దేశం లేదు. ఈ దేశంలో అంతిమంగా ప్రజలే దేవుళ్ళు కాబట్టి.. వారికి వ్యతిరేకంగా నా నిర్ణయం ఉండదు” అని కేటలిన్ ప్రసంగించడం విశేషం.