IPhone: ఐఫోన్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న సెక్యూరిటీ పోన్లు.. అందులోని ఫీచర్ల కారణంగా యాపిల్ సంస్థ ఇప్పటి వరకు 17 జనరేషన్ ఫోన్లు తయారు చేసింది. దేనికదే ప్రత్యేకం. అందుకే డిమాండ్ ఎక్కువ. ఒకప్పుడు వీఐపీలు మాత్రమే వాడే ఐఫోన్ ఇప్పుడు మధ్య తరగతి యువత కూడా సెక్యూరిటీ కోసం కొనుగోలు చేస్తోంది. తాజాగా ఈ ఐఫోన్ ఇప్పుడు సెక్యూరిటీతోపాటు ఒక అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ స్మగ్లింగ్ ముఠాను పట్టించింది. తన ఫోన్‌ను ట్రాక్ చేసిన బాధితుడు అందిచిన సమాచారం ఆధారంగా లండన్ పోలీసులు హీత్రో విమానాశ్రయానికి సమీపంలో ఉన్న గోదాంలో దాడి చేసి దాదాపు 900కు పైగా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఏ జరిగిందంటే..
పోలీసుల పరిశోధనలో ఈ ముఠా బ్రిటన్‌లో దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌లను పెద్ద మొత్తంలో హాంకాంగ్, చైనాకు అక్రమంగా పంపిస్తున్నట్లు బయటపడింది. బ్రిటన్‌లో కనిపించకుండా పోయిన ఫోన్లలో సగం వరకు ఈ గ్యాంగ్ ద్వారానే రవాణా అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ కేసుతో సంబంధంగా ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు మహిళ కూడా ఉంది. ఆమె వద్ద కూడా 30 మొబైళ్లు దొరికాయి. పోలీసుల దాడుల్లో మొత్తం రెండు వేలకు పైగా చోరీ ఫోన్లు లభించాయి. గ్యాంగ్‌లో ప్రధానంగా అఫ్గాన్ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు.
లండన్‌లో పెరుగుతున్న ఫోన్ దొంగతనాలు
గత నాలుగేళ్లలో లండన్ నగరంలో మొబైల్ చోరీలు మూడు రెట్లు పెరిగాయి. పర్యాటకులు అధికంగా వచ్చే వెస్ట్ ఎండ్, వెస్ట్‌మినిస్టర్ ప్రాంతాల్లో ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు రెండు కోట్లకు పైగా సందర్శకులు చేరే నగరంలో, చోరీ ముఠాలు అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో కలసి పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సెకండ్‌హ్యాండ్ మార్కెట్..
సెకండ్‌హ్యాండ్ ఫోన్‌లకు దేశవిదేశాల్లో ఉన్న భారీ డిమాండ్ ఈ అక్రమ రవాణాకు ప్రధాన ప్రేరణగా మారింది. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులు అధిక విలువ కలిగినందున వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
పోలీసుల ప్రకారం, ఇంతకుముందు మాదకద్రవ్యాల రవాణాలో నిమగ్నమైన కొంతమంది నేరస్థులు ఇప్పుడు చోరీ ఫోన్ల విక్రయ దందాలోకి మళ్లారు. తక్కువ రిస్క్‌తో వేగంగా నగదు లభించే ఈ వ్యవహారం నూతన ముప్పుగా మారుతోంది.