Brazil: భారత దేశం ఎండలతో మండిపోతోంది. అనేక రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. వేడి, ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వడదెబ్బతో నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే రెండు రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. భారత్‌లో ఎండ చంపుతుంటే.. విదేశాల్లో వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.
సౌత్ బ్రెజిల్‌లో రికార్డు వానలు..
సౌత్ బ్రెజిల్ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. 80 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 56 మంది చనిపోయారు. దీంతోపాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రియో గ్రాండే దో సుల్‌లో పెరుగుతున్న నీటి మట్టాలు ఆనకట్టలపై మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఆనకట్ట తెగితే పెద్ద విపత్తు తప్పదని భయపడుతున్నారు.
అత్యవసర పరిస్థితి..
బ్రెజిల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ ఈ ప్రాంతంలో పర్యటించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా వరద బాధిత ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తామని తెలిపారు.
ప్రమాదకరంగా నదులు..
ఇక దక్షిణ బ్రెజిల్‌లోని దాదాపు 150 మునిసిపాలిటీలను వరదలు దెబ్బతీశాయి. 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. రియో గ్రాండే డోసుల్ ఇతర ప్రావిన్స్ నుంచి టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపవేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం బుధవారం వరకు 20 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
మొన్నటి వరకు కెన్యాలో..
ఇక నాలుగు రోజుల క్రితం వరకు వర్షాలు, వరదలు ఆఫ్రికా దేశం కెన్యాను వణికించాయి. వరదలు ముంచెత్తడంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. డ్యాం తెగడంతో వందల మంది కొట్టుకుపోయారు. ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా.. పేద దేశం కావడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. మోకాలి లోతు మేర బురద పేరుకుపోయింది.