Hawaii Wildfie : శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక నగరం ఇప్పుడు బూడిద దిబ్బగా మారింది. ఇల్లు-వాకిలి, చెట్టూచేమ, గొడ్డూగోదా సర్వం మాడిమసైపోయాయి. ఎటూ చూసిన కాలిన మృతదేహాలు.. దగ్ధమైపోయిన భవనాలతో హృదయ విదారక దృశ్యాలే కన్పిస్తున్నాయి. అమెరికాలో హవాయి దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు మిగిల్చిన పెను విషాదమిది. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటివరకు 67 మందిని బలి తీసుకుంది.

మంగళవారం నుంచి మంటలు..
హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలోని లహైనా పట్టణంలో గత మంగళవారం రాత్రి మొదలైన ఈ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. సుదూరంలో ఏర్పడిన హరికేన్ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు తోడై క్షణాల్లోనే పట్టణమంతా విస్తరించింది. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. దీంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బూడిదైన కార్లు, నివాసాలు..
కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదయ్యాయి. రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు నామరూపాల్లేకుండా మసైపోయాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో పిల్లులు, పక్షులు, ఇతర జంతువులు మంటల్లో కాలిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి తమ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

సైరన్లు మోగక పెరిగిన ప్రాణ నష్టం..
కార్చిచ్చు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు నిర్లక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మంటలు నివాసాల సమీపానికి చేరేముందు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎలాంటి వార్నింగ్ సైరన్లు మోగించలేదని రికార్డుల్లో తెలిసింది. అందుకు బదులుగా మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియో స్టేషన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపించారట. అయితే అప్పటికే కార్చిచ్చు కారణంగా చాలా చోట్ల విద్యుత్, మొబైల్ సిగ్నళ్లు లేకపోవడంతో ప్రజలకు ఈ సందేశాలు చేరలేదని తెలుస్తోంది. దీని వల్లే అధిక ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
రెండో అతిపెద్ద విపత్తు..
ఆస్తినష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు ఇదని అధికారులు పేర్కొన్నారు. మౌయి దీవిలో ఉండే ఈ పట్టణానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు హవాయిన్ రాజ కుటుంబం ఇక్కడ నివసించింది. ప్రస్తుతం ఇక్కడ 12 వేల మంది నివాసముంటున్నారు. పర్యాటకంగానూ ఈ నగరం ప్రత్యేకమైనది.