Rahul Gandhi – RK : రొటీన్‌ బదిలీలే.. కానీ ఆర్కేకు ఆ కోణం కన్పించింది

ఈ మధ్య రాహుల్‌ గాంధీకి తన పత్రికలో పేజీలకు పేజీలు అందుకే ప్రయారిటీ ఇస్తున్నాడా? రేవంత్‌ ఏం మాట్లాడినా తాటికాయంత అక్షరాలతో ఇస్తున్న కవరేజీ అందులో భాగమేనా?

Written By: Bhaskar, Updated On : August 12, 2023 9:02 pm
Follow us on

Rahul Gandhi – RK : ‘రాహుల్‌ కేసులో స్టేకు నిరాకరించిన గుజరాత్‌ హైకోర్టు జడ్జి బదిలీ’ ఇది ఆంధ్రజ్యోతిలో కన్పించిన ఓ వార్త. శీర్షిక చదువుతుంటే రాహుల్‌ గాంధీకి బెయిల్‌ నిరాకరించారు కాబట్టి ఏమోయ్‌ నువ్వు ఆ స్థానంలో ఉండటానికి వీల్లేదు అంటూ ఆ జడ్జిని సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసినట్టు అనిపిస్తోంది కదూ! అంటే సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది కాబట్టి అది పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరటనిచ్చింది అనుకోవాలా? ఇదే రాధాకృష్ణ గతంలో అమరావతి రాజధాని విషయంలో తీర్పులు చెప్పిన న్యాయమూర్తులు, కోర్టులపై సాక్షి రాతలు రాసినప్పుడు, వైసీపీ నాయకులు కూతలు కూసినప్పుడు.. న్యాయమూర్తులకు రాజకీయాలు ఆపాదిస్తారా? అని శోకాలు పెట్టారు. ఎడిటోరియల్స్‌, పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేశారు. అదే గుజరాత్‌ కోర్టు జడ్జి బదిలీ అయితే మాత్రం.. దానికి రాహుల్‌గాంధీ దిగువ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరించినందుకు అనే ట్యాగ్‌ లైన్‌ యాడ్‌ చేశారు. దీన్నే దమ్మున్న పాత్రికేయం అనాలేమో!

పరువునష్టం కేసులో కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీకి దిగువకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరించిన గుజరాత్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి ప్రతిపాదించింది. ఆయన సహా దేశవ్యాప్తంగా 23 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడి న కొలీజియం ఆగస్టు 3న జరిగిన సమావేశంలో బదిలీలను ప్రతిపాదించింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. బదిలీకి కొలీజియం తీర్మానించిన జాబితాలో జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ సహా నలుగురు గుజరాత్‌ హైకోర్టు జడ్జిలు..పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు జడ్జిలు, మరొకరు అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన జడ్జి ఉన్నారు.

అసలు వాస్తవాన్ని దాచి జడ్జి బదిలీకి రాహుల్‌ ఇష్యూను ముడిపెట్టడమే పిటీ! కేవలం గుజరాత్‌ కోర్టు జడ్జి మాత్రమే బదిలీ కాలేదు. ఏకంగా 23 మంది హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం బదిలీ చేసింది. ఈమాత్రం దానికి ఆ శరభ శరభా అంటూ వార్త రాయడం ఏంటి రాధాకృష్ణా? వార్త రాశావూ సరే.. దానికి రాహుల్‌ గాంధీని లింక్‌ పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌? ఓహో న్యాయవ్యవస్థ కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గుతోంది, ఆ మోడీ ఇక గద్దె దిగడం ఖాయమని ఆర్కే ఉద్దేశమా? ఆ మధ్య రాహుల్‌ గాంధీ కలిశాడు కాబట్టి.. అందుకే ఆయన కోణంలో వార్తలు రాస్తున్నాడు అనుకోవాలా? ఈ మధ్య రాహుల్‌ గాంధీకి తన పత్రికలో పేజీలకు పేజీలు అందుకే ప్రయారిటీ ఇస్తున్నాడా? రేవంత్‌ ఏం మాట్లాడినా తాటికాయంత అక్షరాలతో ఇస్తున్న కవరేజీ అందులో భాగమేనా? ఏంటో నిప్పులు చిమ్మేలా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి ఆర్కే చివరికి ఇలా అయిపోయాడు.