Kamala Harris Husband : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరోవైపు అధ్యక్ష బరిలో నిలిచే అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. దీంతో ప్రచారం స్పీడ్ పెంచారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు హామీలు ఇస్తున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో నిలవగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సర్వే సంస్థలు కూడా ప్రీపోల్ సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కీలకమైన మూడు రాష్ట్రాల్లో రెండింటిలో కమలీ ఆధికత్యత చూపింది. రేసులో ట్రంప్ వెనుకబడడంతో ఇప్పుడు కమలా హారిస్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలా, ట్రంప్ డిబేట్ త్వరలో జరుగనుంది. ఈ క్రమంలో కమలా హారిస్ భర్త కీలక వ్యాఖ్యలు చేశారు.
10న డిబేట్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య సెప్టెంబర్ 10వ తేదీ డిబేట్ జరుగనుంది. దీని కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తాజాగా ఈ డిబేట్‌పై కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహెూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలతో డిబేట్ అంత ఈజీ కాదన్నారు. ఇప్పటివరకు మా మధ్య జరిగే చర్చలు, వాదనల్లో నేను ఒక్కసారి కూడా గెలవలేదని తెలిపారు. కమలా చాలా గొప్ప డిబేటర్ అని పేర్కొన్నారు. ఫస్ట్ క్లాస్ ట్రయల్ లాయర్ అని అన్నారు. కమలా హారిస్ రాజకీయాల్లోకి రాకముందు హారిస్ దంపతులు న్యాయవాదులుగా పని చేశారు. హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.
తొలి డిబేట్‌పై సర్వత్రా ఆసక్తి..
ఇదిలా ఉంటే ఏబీసీ న్యూస్ సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటలకు ఉపాధ్యక్షురాలు హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు డిబేట్ నిర్వహించనుంది. ఇరునేతలు ముఖాముఖి డిబేట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది. గతంలో నిర్వహించిన డిబేట్‌లో బైడెన్, ట్రంప్ మధ్య జరిగింది. ఇందులో బైడెన్ తేలిపోయారు. ఇప్పుడు కమలా, ట్రంప్ మధ్య డిబేట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఈ డిబేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కమలా హారిస్ భర్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.