Pooja Khedkar : పుణేలో ట్రైయినీ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తూ వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేద్కర్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆమె సివిల్స్ రాయకుండా నిషేధం విధించింది. తప్పుడు డాక్యుమెంట్లతో పూజా ఖేద్కర్ ఉద్యోగం పొందినట్టు దర్యాప్తులో తేలింది. యూపీఎస్‌సీ నిబంధనలను ఉల్లంఘించడంతో ఈమేరకు చర్యలు తీసుకుందా. తాజాగా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్‌సీ రద్దు చేసిన కొద్ది వారాలకు కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. ఐఏఎస్ రూల్స్ 1954 కింద ఆమెను ఐఏఎస్ నుంచి తొలగించినట్టు కేంద్రం పేర్కొంది. రూల్–12 కింద ప్రొబేషనర్లు రీ–ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అవడం, ఐఏఎస్ సర్వీసుకు రిక్యూట్‌మెంట్‌కు అనర్హురాలిగా గుర్తించడం, సర్వీసులో కొనసాగడానికి తగరని భావించిన పక్షంలో వారిని తొలగించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
నిబంధనలకు విరుద్ధంగా..
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సీఎస్‌ఈ 2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తేలడంతో దోషిగా కమిషన్ నిర్ణయించింది. యూపీఎస్సీ పరీక్షల్లో తన పేరును మాత్రమేకాకుండా, తన తల్లిదండ్రుల పేర్లు కూడా మార్చుకున్నట్లు గుర్తించారు. అలాగే యూపీఎస్సీ అటెంప్ట్ విషయంలోనూ ఆమె నిబంధనలను తుంగలో తొక్కినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 2009 నుంచి 2023 వరకు మొత్తం 15 సంవత్సరాల ప్రయత్నాల సంఖ్యకు సంబంధించి 1500లకు పైగా అభ్యర్ధుల డేటాను యూపీఎస్సీ పరిశీలించింది. ఈ డేటాలో పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్ మినహా ఎవ్వరూ అనుమతించిన దానికంటే అదనంగా ఎవరూ ఎక్కువ ప్రయత్నాలలో పరీక్ష రాసినట్లు గుర్తించలేదు.
వివాదం ఇదీ..
పూజా ఖేద్కర్ (34) తన ప్రైవేట్ ఆడి కారులో బీకాన్‌ను అనధికారికంగా ఉపయోగించడంతోపాటు, ప్రత్యేక కార్యాలయం, అధికారిక కారును డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా ఫోకస్ ఆమెపైకి మళ్లింది. మొదట్లో పూణేలో ఉన్న ఖేద్కర్‌ను వివాదాల నేపథ్యంలో ఆమెను పూణే జిల్లా కలెక్టర్ వాషిమ్‌కు బదిలీ చేశారు. అయినా ఆమెను చుట్టుముట్టిన వివాదాలు వీడలేదు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆమెను తిరిగి పిలిపించి, ఆమె ‘జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని’ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆమె సమర్పించిన వైకల్యం, బీసీ సర్టిఫికెట్ల ప్రామాణికత కోసం విచారణ జరపగా.. అవన్నీ నకిలీ ద్రువీకరణ పత్రాలుగా దర్యాప్తులో తేలింది. దీంతో యూపీఎస్సీ ఆమె సివిల్స్ అభ్యర్దిత్వాన్ని రద్దు చేయడంతోపాటు, భవిష్యత్తులో ఏ పరీక్షలు రాయకుండా శాశ్వతంగా డీబార్ చేసింది.
కోర్టును ఆశ్రయించిన పూజ..
ఇదిలా ఉంటే యూపీఎస్సీ తన సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంపై పూజ కోర్టును ఆశ్రయించింది. ఇటీవలే దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూడా పూజ యూసీఎస్సీ పరిధిని ప్రశ్నించింది. తన అభ్యర్థిత్వం రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదని కోర్టుకు తెలిపింది. విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కేంద్రం పూజకు షాక్ ఇచ్చింది.