H1B Visa: భారతదేశానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి 2016లో అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓపీటీ ద్వారా ఇంటిగ్రా అనే కంపెనీలో చేరాడు. అయితే ఆ కంపెనీ మోసపూరిత విధానాలకు పాల్పడిందని తర్వాత వెల్లడైంది. ఆ కంపెనీ చేసిన తప్పు వల్ల అతడి H1B వీసా ను అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. ఇలాంటివారు అమెరికాలో చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారి కోసం అమెరికా జిల్లా కోర్టు శుభవార్త చెప్పింది.
ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి చాలామంది విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా.. కొన్ని కొన్ని సార్లు భారతీయ యువతను అక్కడి కంపెనీల యజమానులు మోసం చేస్తుంటారు. అమెరికన్ చట్టాల ప్రకారం మోసానికి పాల్పడిన కంపెనీకి ఎంత బాధ్యత ఉంటుందో.. అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా అదే వర్తిస్తుంది. అయితే దీనివల్ల చేయని తప్పుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని.. ఎన్నో కలలతో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన తాము.. వాటిని నెరవేర్చుకోకుండానే వెనుతిరగాల్సి వస్తోందని.. చాలామంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా అమెరికన్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
యజమాని మోసం చేయడం వల్ల.. H1B వీసా రద్దయితే.. దానిని వ్యక్తిగతంగా సవాల్ చేయొచ్చని అమెరికా జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. USCIS(అమెరికన్ పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఏకపక్షంగా H1B వీసాల రద్దును భారతీయులు సవాల్ చేసిన నేపథ్యంలో అమెరికన్ జిల్లా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.. పదిమంది భారతీయులు తమ H1B వీసా లను అమెరికన్ పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల వారు సవాల్ చేశారు. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టు న్యాయమూర్తి చున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” H1B వీసా దారులు యజమాని మోసం కారణంగా నష్టపోతే.. వారు పోరాడేందుకు అవకాశం కల్పిస్తున్నాం. పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వారి వీసాలు రద్దు చేస్తే.. బాధితులు కోర్టులో సవాల్ చేయొచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కంపెనీ యజమాని 15 సంవత్సరాల క్రితం వీసా మోసానికి పాల్పడ్డాడు.. అతడి కంపెనీలో H1B వీసా హోల్డర్ ఉద్యోగం చేశాడు.. ఆ కంపెనీ యజమాని చేసిన మోసానికి ఆ ఉద్యోగి బలయ్యాడు. అతని వల్ల వీసా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు.. ఇటువంటి వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మోసం చేసిన కంపెనీ మాత్రమే నేరం మోయాల్సి ఉంటుంది. దానితో ఉద్యోగులకేం సంబంధం? వీసా రద్దు పై H1B హోల్డర్లు పోరాటం చేయొచ్చని” న్యాయమూర్తి చున్ వ్యాఖ్యానించారు.
H1B వీసా తిరస్కరణ పై భారతీయులు కోర్టులో దావా వేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో యజమాని మోసం చేయడం వల్ల 70 మంది భారతీయుల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు అమెరికన్ ప్రభుత్వంపై స్థానిక కోర్టులో దావా వేశారు.. దీనిపై అక్కడి కోర్టులో విచారణ జరిగింది. “మోసపూరితమైన కంపెనీల ద్వారా వారు ఉద్యోగాలు పొందారు. అందువల్లే వారు మోసపోయారు. ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయారంటూ” విచారణ సందర్భంగా న్యాయవాదులు కోర్టు ఎదుట వ్యాఖ్యలు చేశారు. వీసాలు తిరస్కరించే ముందు వచ్చే ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఇవ్వకుండా.. డ్యూ ప్రాసెస్ హక్కులు ఉల్లంఘించిందని USCIS పై అప్పట్లో H1B వీసా బాధితులు ఆరోపించారు..” ఆ కంపెనీలో పని చేసిన వారు మోసం చేసినట్టు అమెరికన్ ఏజెన్సీ భావించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా అలా ఏకపక్ష అంగీకారానికి రావడం దురదృష్టకరమని” భారతీయుల తరఫున ఆ కేసును వాదించిన వాస్డెన్ లా అటార్నీ జోనాథన్ వాస్డెన్ అన్నారని బ్లూమ్ బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. ఆ కేసు తర్వాత వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ లో మరో వాజ్యం దాఖలు కావడం.. అందులో H1B వీసా దారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో.. మోసపూరిత కంపెనీల దుర్మార్గానికి చెక్ పడినట్టయింది.. ఇదే సమయంలో అమెరికాకు వెళ్లే చాలామంది భారతీయులకు శుభవార్త లభించినట్టయింది. కంపెనీల మోసాల నుంచి రక్షణ కూడా కల్పించినట్టయింది.