Green Card : అమెరికాలో గత జో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన ఉదార ఇమిగ్రేషన్(Immigration) విధానాలను ఆసరాగా చేసుకుని శరణార్థి హోదా పొందిన విదేశీయులకు గ్రీన్‌కార్డ్ జారీ ప్రక్రియ హఠాత్తుగా నిలిచిపోయింది. ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గాల్లో అమెరికా(America)లోకి ప్రవేశించి శరణార్థి హోదా సంపాదించిన లక్షలాది మంది భవిష్యత్తు అయోమయంలో పడింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక శరణార్థుల గత చరిత్రను సమీక్షించి, వారి నేపథ్యంలో అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని భావిస్తోంది.
Also Read : ట్రంప్ టారిఫ్ దెబ్బ బజాజ్, మహీంద్రా, రాయల్ ఎన్ఫీల్డ్లకు ఎందుకు ఉండదు ?
ట్రంప్ పిడుగు..
ట్రంప్ యంత్రాంగం పాత రికార్డులను తవ్వితీసి, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఈ ప్రక్రియలో వారు స్వదేశంలో నిజంగా హింస, పీడనలకు గురయ్యారా లేక వీసా విధానాలను దుర్వినియోగం చేశారా అనేది తేల్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శరణార్థుల గ్రీన్‌కార్డ్ కలలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
భారతీయులపై ప్రభావం..
భారతీయ శరణార్థుల సంఖ్యలో భారీ పెరుగుదల కూడా గమనార్హం. 2023లో 51,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేశారు, ఇది 2018లో 8,000 మందితో పోలిస్తే 466 శాతం అధికం. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం, మెక్సికో, కెనడా సరిహద్దుల ద్వారా అక్రమంగా ప్రవేశించి ఈ హోదా కోసం అప్లై చేసిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు.
సుదీర్ఘమైన హోదా..
శరణార్థి హోదా పొందే ప్రక్రియ సుదీర్ఘమైనది. సరిహద్దులో చిక్కిన వారు తమ కష్టాలను వివరించాలి, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అధికారులు వారి వాదనలను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో విజయవంతమైన వారికి తాత్కాలిక నివాస అవకాశం లభిస్తుంది. అయితే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులతో శరణార్థుల ప్రవేశాన్ని, హోదా దరఖాస్తులను నిలిపివేశారు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దు వద్ద ఈ విధానం కఠినంగా అమలవుతోంది.
కోర్టులో సవాల్..
ఈ నిర్ణయాలను కొందరు కోర్టుల్లో సవాలు చేశారు. ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి కొందరిని స్వదేశాలకు పంపే ప్రక్రియను అడ్డుకున్నారు. అయినప్పటికీ, గ్రీన్‌కార్డ్ జారీపై ట్రంప్ సర్కార్ కఠిన వైఖరి కొనసాగిస్తోంది, శరణార్థుల ఆశలపై అనిశ్చితి నెలకొంది.
Also Read : బాబోయ్ ఎంత పెద్ద పామో..కాటేస్తే అంతే సంగతులు..