Google : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సరికొత్త మలుపు.. ఎలాన్ మస్క్ చేసిన పనికి తల పట్టుకున్న గూగుల్

ప్రస్తుతం ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని.. ఒకవేళ కమల కనుక పుంజుకుంటే ఆమెదే విజయమని తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి అయితే ఆసక్తికరంగా మారింది.

Written By: NARESH, Updated On : July 30, 2024 8:18 am

elon musk google

Follow us on

Google : ఒకప్పుడు అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయంటే.. పెద్దగా సంచలనాలు నమోదయ్యేవి కావు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత బుష్, బరాక్ ఒబామా, పదవి కాలంలో పెద్దగా సంచలనాలు నమోదు కాలేదు. కానీ ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడో అప్పటినుంచి అమెరికా లో వివాదాలు చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. బంకర్లలో కాల్పులు, రోజుల తరబడి సాగిన ఓట్ల లెక్కింపు, పెద్దల చిత్రాల్లో నటించే నటితో ట్రంప్ శారీరక సంబంధం.. వంటి విషయాలు అమెరికాను కుదిపేశాయి. తాజాగా ట్రంప్ పై హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది.. ఇది జరిగిన కొద్ది రోజులకే అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత అధ్యక్షుడు తప్పుకున్నారు. ఆ తర్వాత కమలా హరీస్ పోటీలోకి వచ్చారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్, కమల మధ్య పోటీ హోరాహోరీగా ఉందని అమెరికన్ మీడియా చెబుతోంది. కమలకు విరాళాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోవైపు హత్యా యత్నం కారణంగా ట్రంప్ కు మద్దతు గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నిధులు కూడా అందిస్తున్నారు. అంతేకాదు గతంలో ట్విట్టర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేసింది. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. అయితే మస్క్ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోకి ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంస్థను లాగారు.”ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒక సంస్థ జోక్యం పెరిగిపోయింది. ఇది సరైన పద్ధతి కాదు. అసలు ఎన్నికల్లో వారు ఎందుకు ఎంట్రీస్తారో అర్థం కావడం లేదని” మస్క్ పరోక్షంగా గూగుల్ సంస్థను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ google సంస్థ నిజంగానే అలాంటి చర్యలకు పాల్పడితే తదుపరి దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పవని మస్క్ హెచ్చరించారు.

మస్క్ ఇటీవల గూగుల్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ అని టైప్ చేశాడు. అయితే దానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్, ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్ పేర్లను గూగుల్ సజెస్ చేసింది. వాటిని వెంటనే మస్క్ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ” వావ్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గూగుల్ బ్యాన్ చేసిందా? అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ ఏమైనా జోక్యం చేసుకుంటుందా? ఇలాంటి పరిణామాన్ని గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. మరి ఈసారి చూడబోతుంటే ఏవేవో జరగబోతున్నట్టు కనిపిస్తున్నాయని” మస్క్ వ్యాఖ్యానించాడు. మస్క్ ఈ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మస్క్ ట్వీట్ కు ఓ నెటిజన్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. “గూగుల్ సంస్థ ఏం చేస్తుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి ఆ సంస్థ డెమొక్రాట్ల చేతిలో ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు.. అయితే దీనికి మస్క్ సమాధానం ఇచ్చాడు. ” ఒకవేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ కనుక జోక్యం చేసుకుంటే.. దాని పర్యవసనాలను తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతిమంగా వారే చిక్కుల్లో పడతారంటూ” మస్క్ సమాధానం చెప్పాడు. అయితే మరికొందరు మస్క్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.” ఎక్స్ లో మీకు ఇష్టం లేని ఖాతాలపై నిషేధం విధించారు కదా.. అలాంటప్పుడు మీరు గూగుల్ ను ప్రశ్నించి ఏం ఉపయోగం? ముందు మీ కింది నలుపు చూసుకోండి అంటూ”కొంతమంది నెటిజన్లు మస్క్ ను ఏకిపడేశారు. ఐతే మస్క్ చేసిన పనికి గూగుల్ తల పట్టుకుంది.

అయితే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్, కమలాకు సమానమైన మద్దతు లభిస్తుందని తెలుస్తోంది. పోటీ గట్టిగానే ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్ ప్రకారం కమలాకు 47%, ట్రంప్ కు 49 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని.. ఒకవేళ కమల కనుక పుంజుకుంటే ఆమెదే విజయమని తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి అయితే ఆసక్తికరంగా మారింది.