Homeఅంతర్జాతీయంTrump-Modi friendship: తగ్గిన ట్రంప్‌.. స్వాగతించిన మోడీ

Trump-Modi friendship: తగ్గిన ట్రంప్‌.. స్వాగతించిన మోడీ

Trump-Modi friendship: భారత్‌పై సుంకాలతో విచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. భారత్, రషా, చైనా కలయిక కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మూడు దేశాల కలయికను తప్పుపడుతూ విమర్శలు చేసిన ట్రంప్‌.. ఇప్పుడు కాస్త మెత్తపడ్డాడు. భారత్‌పై విధించిన సుంకాల ప్రభావంతో భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజాగా స్వరం మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఇరు దేశాల మధ్య ప్రత్యేక బంధం ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో, మోదీ కూడా సానుకూలంగా స్పందించారు, ఇది ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపిరి లభించే అవకాశాన్ని సూచిస్తుంది.

రష్యా చమురు కొనుగోళ్లపై వివాదం..
భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచడం అమెరికాకు చిరాకు కలిగించింది. యుక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఆంక్షలను అమలు చేస్తున్న అమెరికా, భారత్‌ చమురు కొనుగోళ్లను రష్యాకు ఆర్థిక చేయూతగా భావించింది. ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో భారత్‌పై 50% సుంకాలను విధిస్తూ, రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య భారత్‌–అమెరికా సంబంధాలను ఒత్తిడికి గురిచేసింది. అయితే, ట్రంప్‌ తాజా వ్యాఖ్యలలో మోదీని ‘గొప్ప ప్రధాని‘గా కొనియాడడం, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలనే సంకేతంగా కనిపిస్తోంది.

మోదీ సానుకూల స్పందన..
ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ తన ’ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య ‘సమగ్రమైన, వ్యూహాత్మక భాగస్వామ్యం‘ ఉందని పేర్కొన్నారు. ఈ స్పందన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్‌ సానుకూల వైఖరిని సూచిస్తుంది. భారత విదేశాంగ శాఖ కూడా అమెరికాతో సంబంధాలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

స్పష్టమైన విదేశాంగ విధానం..
చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఇంధనం, భద్రతా రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మోదీ–పుతిన్‌ సమావేశం భారత్‌–రష్యా ఆర్థిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మరో అడుగు పడింది. ట్రంప్‌ ఈ సమావేశాన్ని ‘చైనా చీకటి వలయం‘గా వ్యాఖ్యానించడం ద్వారా భారత్, రష్యా, చైనా మధ్య బలపడుతున్న సంబంధాలపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే భారత్‌ తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కొనసాగిస్తోంది. రష్యాతో బలమైన ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూనే, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సమర్థిస్తూ, ఇది భారత ఆర్థిక భద్రతకు అవసరమని పేర్కొన్నారు. అదే సమయంలో, అమెరికా సుంకాల విధానంపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చైనా, యూరోపియన్‌ యూనియన్‌లు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నప్పటికీ, కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వాదించింది.

సుంకాలతో ఒడిదుడుకులు..
అమెరికా విధించిన 50% సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, మోదీ ప్రభుత్వం ’స్వావలంబన’, ’స్వదేశీ’ సూత్రాల ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. వ్యవసాయం, ఐటీ, రక్షణ, డిజిటల్‌ సేవలలో భారత్‌ స్వయంప్రతిపత్తిని సాధించినప్పటికీ, చమురు, రసాయనాలు, టెక్నాలజీలో ఇంకా విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, రష్యాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా భారత్‌ తన ఇంధన భద్రతను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా చైనాతో భారత్‌ సంబంధాలు మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత ఏడేళ్ల విరామం అనంతరం మోదీ చైనా పర్యటన గమనార్హం. ఈ సమావేశం అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా భారత్, రష్యా, చైనా మధ్య త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు ట్రంప్‌ ఆందోళనలకు కారణమయ్యాయి. అందుకే ఇప్పుడు వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోతంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular