Allegations on MS Dhoni: ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో సువర్ణ అక్షరాలతో రాయదగిన విజయాలను అతడు అందించాడు. ఎటువంటి సందర్భంలోనైనా సరే స్థిర చిత్తాన్ని కోల్పోకుండా అతడు అద్భుతంగా నిర్ణయాలు తీసుకునేవాడు. ఏవైనా సరే తనదే బాధ్యత అంటూ ముందుండేవాడు. అందువల్లే 2007లో పొట్టి ఫార్మాట్లో టీమిండియా వరల్డ్ కప్ సాధించింది. 2011లో పరిమిత ఓవర్లలో వరల్డ్ కప్ అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దక్కించుకుంది. భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో విజయాలు అందించి సరికొత్త చరిత్రను సృష్టించాడు ధోని.
ధోని టీమిండియా కు మాత్రమే కాదు ఐపీఎల్లో చెన్నై జట్టుకు కూడా అద్భుతమైన విజయాలు అందించాడు. ఏకంగా ఐదుసార్లు చెన్నై జట్టును విజేతగా నిలిపాడు. ఇటీవల సీజన్లో కూడా చెన్నై జట్టును అతడు ముందుండి నడిపాడు. జట్టుకూర్పు విషయంలో కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికీ… జట్టును నడిపించే విధానంలో మాత్రం ధోని తన ధోరణి మార్చుకోలేదు. అందువల్లే చెన్నై అభిమానులు అతడిని విపరీతంగా ఆరాధిస్తుంటారు. ఇటీవల చెన్నై జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ కూడా హౌస్ ఫుల్ అయిపోయింది. స్టేడియం మొత్తం పసుపు వర్ణం పూసుకుంది. ధోని నామస్మరణతో అభిమానులు ఊగిపోయారు. చెన్నై జట్టు నాయకుడిగా కాకుండా దేవుడిగా ధోని ఉన్నాడని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం ధోనీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ధోని మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధోని తనతో కలిసి హుక్కా తాగిన వారికి మాత్రమే జట్టులో చోటు ఇచ్చేవాడని మండిపడ్డాడు. అంతకుముందు యువరాజ్ సింగ్ తండ్రి యోగిందర్ సింగ్ ధోని మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. తన కొడుకు కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ధోని కారణమని మండిపడ్డాడు. ధోని వల్లే తన కొడుకు కెప్టెన్ కాలేకపోయాడని ఆరోపించాడు. ఇవన్నీ ఇలా ఉంటే పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా మాత్రం తనకు ధోని ఆదర్శమని చెబుతోంది. ధోని లాగానే నిర్ణయాలు తీసుకోవాలని.. ధోని మాదిరిగానే మైదానంలో వ్యవహరించాలని తాను అనుకుంటున్నాట్టు పేర్కొంటున్నది. మరోవైపు బ్రేవిస్ లాంటి ఆటగాళ్లు కూడా ధోని నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ధోని అపారమైన అవకాశాలు ఇచ్చాడని.. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరుపున తాను అదరగొట్టానని పేర్కొన్నాడు. ధోని దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉందని అతడు వ్యాఖ్యానించాడు.
ధోని మీద విమర్శ రావడం ఇదే తొలిసారి కాదు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ధోనినే ఇప్పటికీ చర్చలో ఉంటున్నాడు. ప్రధాన మీడియాలో సర్క్యూలేట్ లో ఉంటున్నాడు. ఒకప్పుడు టీం ఇండియాకు వరల్డ్ కప్ సాధించినప్పుడు కపిల్ దేవ్ మీద కూడా ఇలానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ధోని మీద కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీమిండియా కు అద్భుతమైన విజయాలు కట్టబెట్టిన సారధులకు ఇటువంటి ఇబ్బందులు తప్పవనుకుంటా.