Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లిన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది. సర్వే సంస్థలు కూడా ఈసారి గెలుపును అంచనా వేయలేకపోయాయి. దీంతో ఫలితాల కోసం అమెరికన్లే కాదు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇక ఎన్నికలకు ముందు అభ్యర్థులిద్దరూ చివరి ప్రయత్నంలో ఓటర్లను తమవైపు తిప్పికునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ట్రంప్ మరోమారు అమెరికన్లకు అనుకూలంగా వలసలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక కమలా హారిస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజన వాదాన్ని అమెరికన్లు ఓడించడం కాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పరిరక్షణకు ఓటు వేయాలని దేశం పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారంలో భాగంగా నాకిది కొట్టొచ్చినట్లు కనిపించింది’ అని తెలిపారు.
మిషిగన్‌లో ర్యాలీ..
ఇక ప్రచారం తుది దశలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో కమలా హారిస్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమలా మాట్లాడుతూ ‘ఈసారి రెడ్(రిపబ్లికన్లకు ఓటేసేవి)స్టేట్స్, బ్లూ(డెమొక్రాట్లకు అనుకూలంగా ఓటేసేవి)స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాస్ట్రాలు కలిపి చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీగా కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకు వస్తున్నారు’ అని వివరించారు.
ఫలితాలపై ఉత్కంఠ..
ఇక అమెరికా ఫలితాలపై మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారని అగ్రరాజ్యంలోని ప్రముఖ సర్వే సంస్థలేవీ పసిగట్టలేకపోయాయి. ఓటరు నాడి పట్టుకోవడంలో అన్ని సంస్థలు విఫలమయ్యాయి. ఇది నిజమంగా అమెరికా ఓటర్ల విజయంగానే చెప్పాలి. ఇప్పటికే అమెరికాలో బ్లూ, రెడ్ రాస్ట్రాలు ఉన్నాయి. స్వింగ్ స్టేట్స్ మాత్రమే విజేతను నిర్ణయిస్తాయి. 2020 ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ ఓటర్లు డెమొక్రాట్లవైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారన్నది తెలియడం లేదు.