Fireflies : అది మామూలు దావానలం కాదు.. కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యాపిస్తున్న దావానలం. చెట్లు కాలిపోతున్నాయి. గృహాలు మంటల ధాటికి మాడిపోతున్నాయి. మనుషులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక దళాలు శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడ మంటలు తగ్గడం లేదు. ఇది ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. కెనడాలో గత నెల ఓ పిడుగుపాటుతో ప్రారంభమైన దావానలం.. ఆ దేశంలోని పలు నగరాలను తుడిచిపెట్టేసింది. యెల్లోనైఫ్ నగరంలో ఇళ్లు దహనమై.. ఘోస్ట్‌సిటీగా మారింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ విధించారు. హవాయి దీవిలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవ్వడంతో.. అమెరికావైపు దూసుకుపోతూ వాషింగ్టన్ రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది. దీంతో ఉత్తర అమెరికా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు మెక్సికోలో హిల్లరీ హ్యారికేన్ బీభత్సం సృష్టిస్తోంది.
గంటల వ్యవధిలో..
కెనడా మీదుగా వాషింగ్టన్‌లోని స్పోకాన్ కౌంటీ వద్ద మొదలైన కార్చిచ్చు.. కొన్ని గంటల వ్యవధిలోనే 3,600 ఎకరాలకు విస్తరించింది. బలమైన గాలులు తోడవ్వడంతో దావానలం వేగంగా వ్యాప్తి చెందుతోందని వాషింగ్టన్ రాష్ట్ర సహజ వనరుల విభాగం వెల్లడించింది. ‘‘ఇప్పటికే ఆగ్నేయ వాషింగ్టన్‌లో కొన్ని ఇళ్లు కాలిపోయాయి. ఆస్తినష్టం సంభవించింది. స్పోకాన్ కౌంటీలోని మెడికల్ లేక్ పట్టణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఫోర్‌లేక్స్ పట్టణానికి కూడా మూడో హెచ్చరిక జారీ అయ్యింది. అక్కడి పౌరులను తరలిస్తున్నాం’’ అని ఆ విభాగం అధికార ప్రతినిధి జో స్మైలీ చెబుతున్నారు. అగ్నికీలలు వాషింగ్టన్‌లో విస్తరించకుండా అగ్నిమాపకశాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మెడికల్ లేక్‌లో పౌరులందరినీ తరలించామని ఆ పట్టణ మేయర్ టెరీ కూపర్ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. మరోవైపు కార్చిచ్చు భయంతో ఉత్తర అమెరికా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి.
కెనడాలో బీభత్సం
కెనడాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. వాయవ్య కెనెడా రాజధాని యెల్లోనైఫ్ లో 19వేల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలి బూడిదైపోయిన ఇళ్లు, వాహనాలు, నిర్జన ప్రదేశాలతో ఇప్పుడు ఆ నగరం ఘోస్ట్‌సిటీగా మారిపోయిందని అక్కడి అధికారులు వాపోయారు. 15 వేల మంది పౌరులు రోడ్డు మార్గంలో, 3,800 మంది ఎమర్జెన్సీ విమానాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. లక్షన్నర జనాభా ఉన్న కెలోవ్నా నగరానికి కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. బ్రిటిష్ కొలంబియాలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలిపారు.
-మెక్సికోకు హ్యారికేన్ ముప్పు
మెక్సికోకు హిల్లరీ హ్యారికేన్ ముప్పు పొంచి ఉంది. బాజా కాలిఫోర్నియా వైపు హ్యారికేన్ దూసుకెళ్తోందని అమెరికా జాతీయ హ్యారికేన్ కేంద్రం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రికల్లా ఈ రాకాసి సుడిగాలి మెక్సికోను తాకనున్నట్లు వివరించింది. అయితే.. ఇక్కడ గాలుల వేగం గంటకు 230 కిలోమీటర్ల నుంచి 215 కిలోమీటర్లకు తగ్గిపోయాయని, వేగం కూడా గంటకు 20 కిలోమీటర్ల మేర ఉందని పేర్కొంది.