Finland: మనిషికి ఎంత డబ్బున్నా.. ఏ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నా.. సంతోషమనేది ఉండాలి. అది లేకుంటే అవన్నీ ఉన్నా వ్యర్థమే. దీన్ని మరోసారి. ఫిన్ లాండ్ అనే దేశ ప్రజలు నిరూపించారు. మనిషి తన జీవితాన్ని ఎలా జీవించాలో చేతల్లో చూపించారు. అందువల్లే ప్రపంచ సంతోష ర్యాంకింగ్స్ లో మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు గత ఏడు సంవత్సరాలుగా అక్కడి ప్రజలు నిలకడగా తమ దేశానికి మొదటి స్థానం దక్కేలా చేస్తున్నారు. ఇంతకీ ఫిన్ లాండ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగడానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే..
ఫిన్లాండ్ దేశంలో తక్కువ పని గంటలు ఉంటాయి. తల్లిదండ్రులకు కుటుంబంతో గడిపేందుకు ఉదాహరణగా సెలవులుంటాయి. పని, జీవితం.. ఈ రెండింటి మధ్య అక్కడ సమతుల్యం ఉంటుంది. వ్యక్తిగత కార్యకలాపాలకు అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యమిస్తాయి. దీనివల్ల సంతృప్తి అనేది మనుషుల్లో పెరుగుతుంది. అందువల్లే అక్కడి పని వాతావరణం ప్రజలు ఇష్టపడుతుంటారు.
ఫిన్లాండ్ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఉచిత విద్య లభిస్తుంది. పరీక్షల కంటే సమగ్ర విద్యాభివృద్ధిపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల.. యువతలో నైపుణ్యం అపారంగా ఉంటుంది. పైగా అక్కడి యువతకు అన్ని అంశాలపై విపరీతమైన పట్టు ఉంటుంది. అందువల్లే వారి ఐక్యూ కూడా ఇతర దేశాల యువతతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి దేశంలో స్త్రీ సాధికారత ఎక్కువగా ఉంటుంది. లింగ సమానత్వానికి ప్రాధాన్యం లభిస్తుంది. విద్య, ఉపాధి రంగాల్లో ఆడవారికి సమాన అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల అక్కడ సరి సమానమైన సమాజం ఏర్పడుతోంది. ఇంటి, వంట పనుల్లోనూ అక్కడ లింగ సమానత్వం కొట్టొచ్చినట్టు కల్పిస్తుంది.
విశ్రాంతి, సామాజిక పునరుజ్జీవనం వంటివి ఫిన్లాండ్ దేశాన్ని మహారాష్ స్థాయిలో నిలబెడుతున్నాయి. అక్కడి ప్రజలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. వాటిని పెంపొందించుకునేందుకు ఆవిరి స్నానాలు చేస్తారు. ఇది సౌనాస్ ఫిన్నిష్ సంస్కృతిలో భాగమని అక్కడి ప్రజలు చెబుతుంటారు. దేశంలో మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఈ ఆవిరి స్నానాలు చేస్తుంటారు.
ఫిన్లాండ్ దేశంలో తక్కువ అవినీతి ఉంటుంది. అందువల్లే అక్కడి ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై నమ్మకం ఉంటుంది. పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో నూటికి నూరు శాతం జవాబుదారితనం ఉంటుంది. నైతిక విలువలను పెంపొందించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రతి ఏడాది సరికొత్త విధానాలను తెరపైకి తీసుకువస్తుంది. వాటిని నూటికి నూరు శాతం పాటిస్తుంది.
ఫిన్లాండ్ ప్రజల్లో సమాజంపై అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇరుగుపొరుగు ప్రజలు స్నేహపూరితమైన సంబంధాలను కలిగి ఉంటారు. ప్రతి వేడుకలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. సంబంధాలను పెంపొందించుకునేందుకు, సంఘీభావాన్ని వ్యాప్తి చేసేందుకు, పరస్పర మద్దతు తెలిపేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
ఫిన్లాండ్ దేశం ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తుంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుంది. దేశ ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున బీమా కవరేజ్ ఉంటుంది. దీనివల్ల అక్కడి ప్రజల్లో ఏమాత్రం చిన్న రుగ్మత ఉన్నా వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. అక్కడ వారికి నాణ్యమైన వైద్యం లభిస్తుంది. అందువల్లే అక్కడ మరణాల రేటు తక్కువగా ఉంటుంది.