Homeఅంతర్జాతీయంDonald Trump: ఏమైనా చేయండి.. మాకు మాత్రం వచ్చే నెల 20లోపే పిల్లలు కావాలి.....

Donald Trump: ఏమైనా చేయండి.. మాకు మాత్రం వచ్చే నెల 20లోపే పిల్లలు కావాలి.. అమెరికాలో అల్లాడిపోతున్న ఇండియన్లు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న పౌరసత్వానికి సంబంధించిన సంచలన నిర్ణయం గర్భిణీలలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం పొందే హక్కును రద్దు చేసే ఈ నిర్ణయం, అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కాని తల్లిదండ్రుల బిడ్డల పౌరసత్వాన్ని నిలిపివేస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో, గర్భిణీ మహిళలు ముందస్తు ప్రసవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందస్తు ప్రసవాలపై డాక్టర్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూజర్సీలోని డాక్టర్ రామా మాట్లాడుతూ.. ఇటీవల ముందస్తు ప్రసవాలకు సంబంధించి ఎక్కువగా అభ్యర్థనలు రావడం మొదలైంది. ఈ అభ్యర్థనలు ముఖ్యంగా భారతీయ మహిళల నుండి ఎక్కువగా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు 8వ లేదా 9వ నెలలో ఉంటూ 20 ఫిబ్రవరి నాటికి ముందు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏడో నెల గర్భిణీ తన భర్తతో కలిసి డాక్టర్ రామాను సంప్రదించి, మార్చిలో జరగాల్సిన ప్రసవాన్ని ముందుగానే చేయించాలని అభ్యర్థించింది. తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొంది. దీంతో ఆ డాక్టర్ తనకేం చేయాలో అర్థం కాలేదన్నారు.

ఆరోగ్యానికి ప్రమాదాలు
టెక్సాస్‌లోని డాక్టర్ ఎస్.జి. ముక్కల్ మాట్లాడుతూ.. ముందస్తు ప్రసవాలు తల్లులకే కాకుండా బిడ్డల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమన్నారు. “ముందస్తు ప్రసవాలతో పలు సమస్యలు తలెత్తుతాయి. శిశువుల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, తక్కువ బరువు, నరాల సమస్యలు లాంటి సమస్యలు రావచ్చు,” అని తను అన్నారు. గత రెండు రోజులలో దాదాపు 15-20 మంది జంటలు ముందస్తు ప్రసవం గురించి చర్చించినట్లు తెలిపారు.

పౌరసత్వంపై ఆశలు, గ్రీన్ కార్డ్ సందిగ్ధాలు
మార్చిలో ప్రసవం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మహిళ, తమ కుటుంబ స్థిరత్వం కోసం ఈ ప్రక్రియను అవలంబించాల్సి వస్తుందని తెలిపింది. గడచిన ఆరు సంవత్సరాలుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నామని, ట్రంప్ నిర్ణయం తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె వాపోయింది.

22 రాష్ట్రాల్లో ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత
అమెరికాలో 22 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకంగా కేసు వేశారు. ఈ నిర్ణయం అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం ఇచ్చే 100 ఏళ్ల నిబంధనను రద్దు చేయడమేనని, ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని వారు ఆరోపిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న వలస దారుల మధ్య అప్రమత్తత, గర్భిణీ మహిళల్లో భయం, సందిగ్ధతలను పెంచుతోంది. దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉంది.

Exit mobile version