Anantapur
Anantapur: అంతటా నిర్బంధ విద్య కొనసాగుతోంది. ర్యాంకులతో పాటు కాలేజీల మధ్య ఆధిపత్యంతో విద్యార్థులపై ఒత్తిడి( mental tension) పెంచుతున్నారు. నిత్యం చదువు పేరుతో నిర్బంధ విద్యను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బలవన్మరణాలకు దిగుతున్నారు. ఏపీలో అనంతపురం జిల్లాలో( Ananthapuram district) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న చరణ్ అనే యువకుడు కాలేజీ మూడో భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులంతా చూస్తుండగానే ఈ ఘటనకు పాల్పడడంతో వారిలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే కాలేజీ యాజమాన్యాలు, సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక.. సదరు విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. అయితే గతంలో సైతం ఆ కార్పొరేట్ కాలేజీలో ఇలా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం అనేకసార్లు చూశాం. అయితే ఒకవైపు విద్యార్థులకు తరగతులు జరుగుతుండగానే.. చరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.
* సంక్రాంతి సెలవుల నుంచి వచ్చిన తర్వాత
చరణ్ (charan)అనే యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆయన స్వగ్రామం రామాపురం. సంక్రాంతి సెలవులు అనంతరం కాలేజీకి వచ్చాడు. ఈరోజు క్లాసులు జరుగుతుండగానే మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తూ.. అందరూ చూస్తుండగానే బయటకు వచ్చి మూడో అంతస్తు బిల్డింగ్ పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన చరణ్ ను కళాశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణం తెలియదు. అయితే చదువులో ఒత్తిడికి గురై ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని అనుమానాలు ఉన్నాయి.
* తీరు మారడం లేదు
విద్యార్థుల బలవన్మరణాలకు పాల్పడుతున్నా కార్పొరేట్ కళాశాలల( corporate colleges) తీరు మారడం లేదు. కేవలం ర్యాంకుల కోసమే విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. సెలవులతో పాటు రోజు మొత్తంలో అత్యధిక సమయంలో విద్యా బోధన చేస్తున్నారు. అంతటితో ఆగకుండా రకరకాల వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. కానీ అక్కడ చదువు అర్థం కాక.. యాజమాన్యంతో పాటు సిబ్బంది వేధింపులు తాళలేక చాలామంది విసిగి వేసారి పోతున్నారు. చదువులో ఎక్కడ వెనుక బడ్డమో అని ఆందోళనకు గురవుతున్నారు. ఏపీలో అధికారికంగా ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటిస్తే.. కొన్ని కాలేజీలు తరగతులు నిర్వహించాలని ప్రచారం జరిగింది. అయితే నిర్బంధ విద్య నేరమని నిబంధనలు చెబుతున్నా.. కార్పొరేట్ కాలేజీలు మాత్రం అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. అయితే ఆ భారాన్ని తట్టుకోలేక చాలామంది విద్యార్థులు తను చాలిస్తున్నారు.
* తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ హవా
తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) కార్పొరేట్ కాలేజీల హవా నడుస్తోంది. గతంలో ఒకటి రెండు కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఉండేవి. కానీ ఏటా పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. ర్యాంకుల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాకమునుపే.. తల్లిదండ్రులను కలుస్తున్నాయి. రకరకాలుగా మభ్యపెట్టి అడ్మిషన్లు చేయించుకుంటున్నాయి. అయితే ప్రధానంగా గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ విద్యా బోధనకు అలవాటు పడటం లేదు. అక్కడి వాతావరణానికి సైతం సర్దుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో చదువు పేరిట ఒత్తిడి చేస్తుండడంతో బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.