Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఏడు పదులు దాటింది. కానీ మనోడి కోరికలు మాత్రం గుర్రాల్లా పరిగెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్యం బలోపేతం విషయంలో మూడో పర్యాయం కూడా కొనసాగిస్తామని సూచించారు. వెంటనే తన మాటను సరిదిద్దుకున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఆకాంక్షలపై కొత్త చర్చను రేకెత్తించాయి.
ట్రంప్ ఏమన్నాడంటే..
అమెరికాకు స్వాతంత్రం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మొదటి పర్యాయంలో సైన్యాన్ని బలపరిచామని చెప్పి, రెండో పర్యాయంలోనూ అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే “రెండోది… కాదు, మూడో టర్మ్‌లో కూడా” అని అనడం అందరి దృష్టి ఆకర్షించింది. వెంటనే తేరుకున్న తర్వాత ఆయన “అలా అనకూడదు” అంటూ వెనక్కి. తగ్గారు. ఇది కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన నిజంగా మూడో పర్యాయం గురించి ఆలోచిస్తున్నారా లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి.
రాజ్యాంగ నిబంధనలు ఇలా..
అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ స్పష్టంగా ఏ వ్యక్తి అయినా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేడని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ, రాష్ట్రాల్లో మూడింట నాలుగు వంతుల ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్‌గా భావిస్తున్నారు. అయితే ఆయన మాటలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహం కలిగించగా, ప్రత్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాయి.
గత సంకేతాలు, ప్రస్తుత చర్చ..
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన మూడో పర్యాయం గురించి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. కొందరు దీన్ని ట్రంప్ తన బలమైన మద్దతు వర్గాన్ని కదిలించడానికి, రిపబ్లికన్ పార్టీలో తన ప్రభావాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంగా చూస్తున్నారు. మరికొందరు ఇది భవిష్యత్తులో రాజ్యాంగ మార్పుల గురించి చర్చను రేకెత్తించడానికి ఉద్దేశించినదిగా అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ రచ్చ..
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో రెండు వైపులా ప్రభావం చూపుతున్నాయి. ఆయన మద్దతుదారులు దీన్ని ఆయన నాయకత్వ బలానికి సంకేతంగా చూస్తుంటే, ప్రత్యర్థులు దీన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అధ్యక్ష పదవికి రెండు పర్యాయాలు మాత్రమే అనుమతించే నిబంధనను మార్చడం చాలా కష్టం. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ట్రంప్ ఇప్పటికే వలస విధానాలు, వాణిజ్య విధానాలతో తీవ్ర చర్చలను రేకెత్తించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు మూడో టర్మ్ సంకేతం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ట్రంప్ మూడో పర్యాయం గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్టంట్ అని కొంతమంది భావిస్తున్నారు. మరికొందరు నిజమైన ఆకాంక్ష అంటున్నారు. అయితే రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన పరిమితులను అధిగమించడం చాలా కష్టం. ఇది ట్రంప్ రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చను రేకెత్తించింది.

