Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధ్యక్ష అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు.. అందరినీ తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంతకాలం వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు ఆ స్థాయికి కూడా దిగజారారు. ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ట్రంప్ ముందుగా కమలా హారిస్ ఇంటర్య్వూ వీడియోపై సెటైర్లు వేశారు. ఇంటర్వ్యూను ఎడిట్ చేసి ప్రసారం చేశారని మండిపడ్డారు. కమలాకు మాట్డాడం చేతకాదని విమర్శించారు. ఈమేరకు ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీడియా సంస్థకు లేఖ కూడా రాశారు. దీంతో కమలా కూడా ట్రంప్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ట్రంప్‌కు మతి భ్రమిస్తోందని, ఆయన గెలిస్తే.. రష్యాకు అనుకూలంగా ఉంటారని ఆరోపించారు. పుతిన్ వెళ్లి ఉక్రెయిన్ రాజధానిలో కూర్చుంటారని ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ మరోమారు హారిస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె గెలిస్తే చైనా ఆడుకుంటుంది..
కమలా హారిస్‌ను అధ్యక్షరాలిగా గెలిపిస్తే చైనా ఆమెను ఆటాడుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రచారంలో భాగంగా ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈమేరు వ్యాఖ్యలు చేశారు. హారిస్‌ను పొరపాటున కూడా గెలిపించొద్దన్నారు. గెలిస్తే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంటుందని.. అప్పుడు ఆమె ఎలా వ్యవహరిస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంబ్ సమాధానం చెబుతూ.. జిన్‌పింగ్ కమలాను ఓ చిన్న పిల్లలా చూస్తాడన్నారు. చాక్లెట్లు లాగేసినట్లుగా మన సంపద దోచుకుంటారని పేర్కొన్నారు. చెస్‌లో గ్రాండ్ మాస్టర్ ఎలా ఆడతారో కమలాను కూడా జిన్ పింగ్ అలా ఆడుకుంటాడని పేర్కొన్నారు. కమలాకు అధికారం ఇస్తే ప్రజల జేబులన్నీ ఖాళీ చేస్తారని దుయ్యబట్టారు.
కాస్త ముందంజలో ట్రంప్..
ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికల సర్వేలో ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. సర్వేలో మొన్నటి వరకు హారిస్ ఆధిక్యంలో ఉండగా, తాజాగా ట్రంప్ ఆమెను వెనక్కి నెట్టారు. వాల్‌స్ట్రీట్ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు 47 శాతం మద్దతు రాగా, కమలాకు 45 శాతం మద్దతు దక్కింది. ఇక సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనామిక్స్ సర్వేలో కూడా ట్రంప్ హారిస్ కన్నా రెండు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.