CM Revanth Reddy: తెలంగాణలో ఏడాదికాలంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లు తెలంగాణను పాలించడమే కాకుండా కాంగ్రెస్‌ను బలహీన పర్చేందుకు అనేక కుట్రలు చేసింది. ఎమ్మెల్యేలను చీల్చి గత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌తోపాటు భూ దందాలు, అక్రమాలపై దృష్టిపెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుగుతోంది. మరోవైపు ధరణిలో అక్రమాల నిగ్గు తేల్చేపనిలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వంలోకి కీలక నేతల మెడకు చుట్టుకోవడం ఖాయం అన్న అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు బాంబులు పేలే లిస్ట్ సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో ఉంది. మొదట పేలే బాంబాబు ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది.
ఆధారాలతో ఫైళ్లు సిద్ధం..
తెలంగాణలో కీలక నేతల అరెస్టులు ఖాయం అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈమేరకు బీఆర్‌ఎస్ నేతలు అక్రమాలపై ఫైళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం రూపొందిచిన జాబితాలో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో వరుస పరిణామాలు ఉంఆయని ముఖ్య నేతలు లీకులు ఇస్తున్నారు. దీంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది.
ఈ అంశాలపై ఫోకస్..
కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన పది నెలలుగా బీఆర్‌ఎస్ నేతల భరతం పట్టేందుకు ఫోన్ ట్యాపింగ్, ధరణి, భూ అక్రమాలపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు అంశాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. కుంభకోణాలు, ఆస్తుల రికవరీతోపాటు అరెస్టులను చట్టం చూసుకుంటుందని మంత్రి చెప్పారు. తాజా పరిస్థితి చూస్తుంటే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని తెలుస్తోంది. మూడు అంశాల్లో ఎవరి పాత్ర ఎంత.. అనే లెక్కలు కూడా తీశారని సమాచారం.