Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకించారు. మరుసటి రోజు నుంచే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో ఇబ్బడి ముబ్బడిగా జుడీషియల్ ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. జన్మతః పౌరసత్వం రద్దు చేశారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. అక్రమంగా దేశంలో ఉంటున్నవారిని తరలిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను ఎనిమిది నెలల జీతం తీసుకుని వెళ్లిపోవాలని సూచించారు. ఇక యుద్ధాలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అమెరికాకు లాభం చేకూర్చేందుకు ఐటీ ఎత్తివేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని విదేశాల నుంచి రాబాట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క కలం పోటుతో మెక్సికో, కెనడా, చైనాపై సుంకాలు విధించారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే ట్రంప్ నిర్ణయంపై ఆ దేశాలు మండిపడుతున్నాయి. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాపై ప్రతీకారానికి కెనడా, మెక్సికో రెడీ అయ్యాయి. ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీవోలో సవాల్ చేస్తామని చైనా ప్రకటించింది.
అగ్రరాజ్యాధినేతకు కౌంటర్లు..
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయా దేశాలు అమెరికా అధ్యక్షుడికి కౌంటర్లు ఇస్తున్నాయి. మరోవైపు కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. 155 బిలియన్ కెనిడయన్ డాలర్ల అమెరికా దిగుముతలపై 25 శాతం పన్ను విధిస్తున్నామని ప్రకటించారు. వాషింగ్‌టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన. ఇందులో 30 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని పేర్కొన్నారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్ అనుకుంటే మాతో భాగస్వామ్యం కోరుకోవాలని సూచించారు. అదే వారికి మంచిదని తెలిపారు.
మెక్సికో కూడా వార్నింగ్..
ఇక మెక్సికో కూడా అమెరికాకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేనాబమ్ మాట్లాడుతూ మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుందని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన అరోపణలను ఖండించారు. నాలుగు నెలలుగా 20 మిలియన్ డోస్‌ల ఫెంటనిల్ సహా 40 టన్నులకుపైగా డ్రగ్స్ పట్టుకున్నామని తెలిపారు. పదివేల మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మాదకద్రవాలను అరికట్టాలని అమెరికా నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సుంకాలు విధిస్తే సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.
చైనా కూడా..
ఇక ట్రంప్ చర్యలపై చైనా మండిపడింది. తాజాగా చైనా వాణిజ్య మంత్రి స్పందిస్తూ చైనా ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందని తెలిపారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని తెలిపారు. సుంకాల పెంపుతో అమెరికా సమస్యలు తీరకపోగా, ఆర్థిక, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. డ్రగ్స్, ఫెంటనిల్ సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.