U19 Women’s World Cup Final: ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. వాన్ వర్సి(23), ఫే కౌలింగ్(15), బోతా(16) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పౌర్ణిక సిసోడియా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 83 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలో దిగిన టీమ్ ఇండియా 11.2 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ కమిలిని (8) నిరాశపరిచినప్పటికీ.. మరో ఓపెనర్ గొంగడి త్రిష (44), శానికా చాల్కే (26) పరుగులు చేసి జట్టు విజయ పథంలో నడిపించారు.
ప్రారంభం నుంచి దూకుడుగానే..
కౌలాలంపూర్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మైదానంపై తేమ అధికంగా ఉండడంతో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తెలుగు అమ్మాయి త్రిష నాలుగో ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.. భారత బౌలర్ల ధాటికి లౌరెన్స్(0), సేషినే నాయుడు(0), ఆశిలిగే వాన్(0), మోనాలిసా లిగోడి(0) డక్ అవుట్ గా వెనుతిరగడం విశేషం. ఈ టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి..టేబుల్ టాపర్ గా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అందరూ ఊహించినట్టుగానే దక్షిణాఫ్రికా జట్టుపై విజయ దుందుభి మోగించింది. దక్షిణాఫ్రికా జట్టు కూడా మూడు మ్యాచ్లో గెలిచి.. నెట్ రన్ రేట్ తో అధికంగా ఉండడంతో ఆస్ట్రేలియను కాదని.. ఫైనల్ దూసుకొచ్చింది. ఫైనల్లో ఎప్పట్లాగానే ఒత్తిడికి తలం వచ్చింది. అయితే సీరిస్ మొత్తం తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని కనబరిచిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే జోరును ప్రదర్శించింది. ఫలితంగా విజేతగా ఆవిర్భవించింది.