Diwali Buying Gold: దీపాల పండుగ దీపావళి ఉత్సవాలు అరబ్ దేశమైన దుబాయ్ లో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవులకు తోడు భారతీయ పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించడంతో అక్కడి కుటుంబాల్లో సందడి నెలకొంది. మరో పక్క ధన త్రయోదశి, దీపావళి పండుగను పురస్కరించుకొని భారతీయులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. ధన త్రయోదశి సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. ఆదివారం రాత్రి వరకు ఒక దుబాయ్ లోనే 10 క్వింటాళ్ళకు పైగా బంగారం అమ్మకాలు జరిగాయి. ఇక సోమ, మంగళవారం అయితే 30 క్వింటాళ్ల వరకు బంగారం విక్రయాలు జరిగాయి.. పసిడి ధరలు కూడా తగ్గడం ఇందుకు కలిసి వచ్చిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

ధర ఎందుకు తగ్గింది అంటే
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తాలూకు పరిస్థితులు ఏర్పడడంతో బంగారం ధర తగ్గింది. దీంతో దుబాయ్ ప్రాంతంలో గత సంవత్సరం దీపావళికి 22 క్యారెట్ల బంగారం ధర 200 దిర్హమ్ లు గా ఉంది. ఇప్పుడు అది 188 కి పడిపోయింది. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు పెరిగాయి. ఒక్క మలబార్ గోల్డ్ షాపులోనే మూడు క్వింటాళ్ల బంగారం వికయాలు జరిగాయి.. బంగారం ధర తగ్గడంతో పెద్ద సంఖ్యలో భారతీయులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఇక దీపావళి సందర్భంగా దుబాయ్ లోని అనేక షాపింగ్ మాల్స్ లో వారం పాటు ప్రత్యేక ఆఫర్లు పెట్టారు. అయితే ఎన్ని ఆఫర్లు పెట్టినా కోవిడ్ ముందు ఉన్న పరిస్థితిని మాత్రం చేరుకోలేదని వ్యాపారులు వ్యాఖ్యానించారు.. ఇక చరిత్రలో మొదటిసారిగా సౌదీ అరేబియా రాజధాని రియాద్, జెద్దా లో దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చారు. తెలుగు రాష్ట్రాల తరఫున తెలుగు ప్రవాసీ సంఘం, సాటా సభ్యులు ఇందులో పాల్గొన్నారు. గతంలో ఎన్నడు కూడా సౌదీ అరేబియాలో దీపావళి పండుగ నిర్వహించలేదు.. కానీ ఈ ఏడాది పండగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకు కారణం లేకపోలేదు. దుబాయ్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా ఉంటుంది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే కట్టడాలు ఇక్కడ నిర్మితమవుతూ ఉంటాయి.

ఈ రంగంలో పని చేసేందుకు మనుషులు ఎక్కువ అవసరం పడుతుంది. దుబాయ్ లో ఈ నిర్మాణ అవసరాలకు పని చేసే కార్మికుల్లో ఎక్కువ శాతం భారతీయులే ఉంటారు. అందుకే వారు తమ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించి ఈసారి సౌదీ అరేబియాలో అధికారికంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఇక మరోవైపు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్ కు వస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ద్వారా ప్రధానమంత్రి మోడీ గత నెలలో పంపిన ఆహ్వానం మేరకే ఆయన భారత్ కు వస్తున్నారని సమాచారం. నవంబర్ 14వ తేదీ ఉదయం భారత్ కు వచ్చే సల్మాన్ ఆ రోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. అనంతరం జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో పెట్టుబడుల అంశంపై మోడీ, సల్మాన్ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్, అరబ్ దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయని చాలామంది వ్యాఖ్యానించారు. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి నోళ్లకు తాళం వేసింది. భారతదేశంతో పూర్తిస్థాయిలో మైత్రి కోరుకుంటున్నామని సోమవారం నిర్వహించిన దీపాల వేడుకల్లో అరబ్ దేశాల ప్రతినిధులు తెలిపారు. స్వయంగా దీపాలు వెలిగించి భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన మిఠాయిల పంపిణీ కూడా చేపట్టారు.