https://oktelugu.com/

Antarctica :  దట్టంగా మంచు ఉండే అంటార్కిటికాలో.. అమెజాన్ లాంటి పచ్చదనం… ఇది ఎలా సాధ్యమైందంటే..

అంటార్కిటికా.. ఈ పేరు గుర్తుకు రాగానే మనకు వెంటనే దట్టమైన మంచు స్ఫురణకు వస్తుంది. అలాంటి ప్రాంతంలో మనిషి జాడ కనిపించదు. ధ్రువపు ఎలుగుబంట్లు, కొన్ని రకాల చేపలు, ఇంకా పలు రకాల జంతువులు ఆ ప్రాంతంలో కనిపిస్తాయి. అంటార్కికా ఖండంలో మంచు శిఖరాలు ఉంటాయి. అక్కడ మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 8, 2024 / 12:32 AM IST

    Antarctica

    Follow us on

    Antarctica :  అంటార్కిటికా ఖండంలో మంచు కొంతకాలంగా కరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల క్రమంగా మంచు శిఖరాలు కరిగిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం యాదృచ్ఛికంగా హరితవనంగా మారుతున్నది. అమెజాన్ అడవిలాగా హరిత వర్ణాన్ని సంతరించుకున్నది. గత 30 సంవత్సరాల తో పోలిస్తే ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో పచ్చదనం పరుచుకుంది. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించారు. 1986 -2021 కాలంలో అంటార్కిటికా ఖండం లో వృక్ష సంపద చదరపు కిలోమీటర్ నుంచి సుమారు 12 చదరపు కిలోమీటర్లకు.. అంటే పది రెట్లకు పైగా పెరిగింది. లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్ టర్ కు చెందిన పరిశోధకులు.. ఇటీవల ఉపగ్రహాల నుంచి సమాచారం సేకరించి.. ఈ విషయాన్ని వెల్లడించారు. 2016 నుంచి 2021 మధ్య అంటార్కికా ఖండంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సముద్రం – మంచు విస్తీర్ణంలో భారీగా తగ్గుదల చోటుచేసుకుంటున్నది. ఇదే సమయంలో కరిగిన మంచుకు సమానంగా వృక్షాలు పెరుగుతున్నాయి.. ప్రపంచం మొత్తం సగటు కంటే అంటార్కిటికా సగటు వేగంగా వేడెక్కుతోంది. అందువల్లే ఇటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. కరిగిన మంచు స్థానంలో పెరుగుతున్న మొక్కలు అధిక శాతం నాచు జాతికి చెందినవని పరిశోధకులు చెబుతున్నారు. భూమిలో కఠినమైన పరిస్థితులు ఉండడం వల్ల ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని పరిశోధకుల్లో ఒకరైన థామస్ రోనాల్డ్ ప్రకటించారు. ఒకవేళ భూమి వేడి ఇలానే పెరిగితే ఈ మొక్కలు తమకు తాముగా మరింత స్థితిస్థాపక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయని.. ఫలితంగా ఈ ప్రాంతంలో పచ్చదనం మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

    పేలవంగా ఉన్నాయి

    అంటార్కిటికా ఖండంలో నేలలు అత్యంత పేలవంగా ఉన్నాయి. అయినప్పటికీ మొక్కల పెరుగుదలలో సేంద్రియ పదార్థాన్ని జోడిస్తున్నాయి. తద్వారా నేల ఏర్పడే అవకాశానికి బీజం వేస్తున్నాయి. దీనివల్ల మొక్కలు మరిన్ని పెరిగి.. పచ్చదనం విస్తరిస్తోంది.. అయితే ఇలానే అంటార్కిటికా ఖండం కరిగితే ముద్ర మట్టాలు పెరుగుతాయని.. ఆ తర్వాత తీర ప్రాంత నగరాలు నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అవి అంతిమంగా అంటార్కికా ఖండంలో మంచు కరగడానికి కారణమవుతున్నాయి. మంచు అదేపనిగా కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సముద్ర ప్రాంతాల్లో ఉన్న నగరాలలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పైగా అనేక జాతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అంటార్కటికాలో మంచు కరిగితే కేవలం సముద్ర మట్టాలు మాత్రమే కాకుండా.. అనుకోని వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాలలో కరువు కాటకాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే వాతావరణంలో కాలుష్య స్థాయిని తగ్గించాలని.. పరిశ్రమల నుంచి కర్బన ఉద్గారాలను తగ్గించాలని హితవు పలుకుతున్నారు.