December 31st: డిసెంబర్ 31 అంటే చాలామంది దావత్ చేసుకుంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అర్ధరాత్రి పూట రోడ్లమీదకి వచ్చి హంగామ చేస్తుంటారు. వాస్తవానికి గతంలో ఇలా ఉండేది కాదు. కొంతకాలంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఫలితంగా డిసెంబర్ 31 అనేది కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే అనే విధంగా మారిపోయింది.
డిసెంబర్ 31వ తేదీ కి ప్రపంచ చరిత్ర గతిని మార్చిన సత్తా ఉంది. ఈ తేదీని చరిత్రకారులు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుంటారు. ఇంతకీ ఈ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని అద్భుతాలు.. ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చోటుచేసుకున్నాయో ఒకసారి మననం చేసుకుంటే.. వింతగా అనిపిస్తూ ఉంటుంది.
డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ 1 ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ మంజూరు చేశారు. తద్వారా సుగంధ ద్రవ్యాల వ్యాపారం పై డచ్ గుత్తాధిపత్యాన్ని దెబ్బ కొట్టారు.
డిసెంబర్ 31, 1775 సంవత్సరంలో పేట్రియాట్ దళాలు క్యూబెక్ నగరం మీద దాడి చేశాయి. కల్నల్ బెనె డిక్ట్ ఆర్నాల్డ్, రిచర్డ్ గోమేరి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఈ మిషన్ విఫలం కావడంతో కెనడాను స్వాధీనం చేసుకోవాలనే పేట్రియాట్ దళాల ఆశలు అడియాసలు అయ్యాయి.
డిసెంబర్ 31, 1862లో ఇనుప ఫ్లాట్ యుద్ధనౌక యుఎస్ఎస్ మానిటర్ తుఫానులో మునిగిపోయింది. ఉత్తర కరోలినా ప్రాంతంలో కేఫ్ హట్టే రాస్ వద్ద కూలిపోయింది.
డిసెంబర్ 31, 1879 న థామస్ ఆల్వా ఎడిసన్ తాను కనిపెట్టిన విద్యుత్ కాంతిని మొట్టమొదటిసారిగా బహిరంగంగా ప్రదర్శించాడు. న్యూజెర్సీ ప్రాంతంలోని మోన్లో పార్కులో వీధులు మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోయాయి.
డిసెంబర్ 31, 1968లో సోవియట్ యూనియన్ TU 144 విమానాలను పరీక్షించింది. విమానయానంలో ఇది సరికొత్త రికార్డులను సృష్టించింది.
డిసెంబర్ 31, 1972లో రాబర్ట్ క్లమెంటే విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ప్యూర్టో రికా తీరంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఆయన నికరగవలో భూకంప బాధితులకు సహాయం చేస్తున్నారు.
డిసెంబర్ 31, 1984లో నల్లజాతీయులను కాల్చి చంపిన బెర్న్ అనే వ్యక్తి న్యూ హంప్ షైర్ లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
డిసెంబర్ 31, 1985లో రిక్ నెల్సన్ అనే గాయకుడు టెక్సాస్ ప్రాంతంలో జరిగిన అభిమాన ప్రమాదంలో చనిపోయాడు. అమెరికాకు పాప్ సంగీత సంస్కృతిని ఇతడు పరిచయం చేశాడు.
డిసెంబర్ 31, 1999 సంవత్సరంలో పనామా కాలువను పనామా ప్రాంతానికి అప్పగించారు. పనామా కాలువ నిర్వహణ బాధ్యతల నుంచి అమెరికా తప్పుకుంది.
డిసెంబర్ 31, 1999 సంవత్సరంలో రష్యా తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ నియమితుడయ్యాడు. అంతకుముందు బోరిస్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన రాజీనామా చేసి పుతిన్ కు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
డిసెంబర్ 31, 2019లో చైనాలోని ఊహాన్ అధికారులు అసాధారణమైన న్యూమోనియా వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. ఆ తర్వాత దానికి వారు కోవిడ్ 19 అని పేరు పెట్టారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారి లలో ఒకటిగా కోవిడ్ 19 పేరుపొందింది.