Indian Students : విదేశాల్లో భారతీయుల మరణమృదంగం.. ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు మృతి!

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు వివిధ కారణాలతో అక్కడ మృత్యువాత పడుతున్నారు. కొందరు ప్రమాదాలకు గురై దుర్మరణం చెందితే కొందరు విదేశీయుల దాడుల్లో మరణిస్తున్నారు. కొందరు అదృశ్యమవుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 27, 2024 4:05 pm
Follow us on

Indian Students : విదేశీ విద్య మోజు భారతీయుల్లో ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన విదేశీ విద్య.. ప్రస్తుతం ప్రభుత్వాల ప్రోత్సాహం.. బ్యాంకర్లు ఇస్తున్న రుణాలతో మధ్య తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను విదేశాల్లో చదివించాలని కలలు కంటున్నారు. ఇందుకోసం ఎంత కష్టమైనా తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు. డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకుంటున్నారు. దీంతో గడచిన ఐదేళ్లలో ఒక్క అమెరికాకే 5 లక్షల మంది భారతీయులు వెళ్లినట్లు అమెరికా సెన్సెస్‌ ప్రకటించింది. దీంతో అమెరికాలో భారతీయ జనాభా కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికా తర్వాత చాలా మంది కెనడా, జపాన్‌ బ్రిటర్, జర్మనీ, తదితర దేశాలకు వెళ్తున్నారు. భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండడంతో కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయి. దీంతో అద్దెలు, వీసా చార్జీలు భారీగా పెంచాయి. కెనడాలో తాత్కాలిక ఉపాధి అవకాశాలను కుదించింది. ఇక ఆయా దేశాల్లో ఉండే గడువును కూడా కుదించాయి. ఇదిలా ఉంటే.. ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపుతున్న తల్లిదండ్రులకు కొందరు తీరని దుంఖాన్ని మిగులుస్తున్నారు. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడ రోడ్డు ప్రమాదాలు, సముద్ర జలాలు, జలపాతల్లో పడి మృతిచెందుతున్నారు. విగత జీవులుగా శవ పేటికల్లో ఇళ్లకు చేరుకుంటున్నారు. కొందరిని అక్కడి దుండగులు దాడిచేసి చంపుతున్నారు. కొందరిని కిడ్నాప్‌ చేస్తున్నారు. ఇలా కారణం ఏదైనా… గడిచిన ఐదేళ్లలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు 600లకుపైగా మరణించారు. ఈమేరకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈమేరకు ఆ శాఖ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ రాజ్య సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.

ఐదేళ్లలో 633 మంది..
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో మొత్తం 633 మంది విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కల్పోయారు. అత్యధికంగా 172 మంది కెనడాలో మృతిచెందారు. ఆ తర్వాత యూకేలో 58 మంది, ఆస్ట్రేలియాలో 57 మంది, రష్యాలో 37 మంది, జర్మనీలో 24 మంది, పాకిస్తాన్‌లో ఒకరు మరణించారు. ఇటీవల విదేశాల్లో భారతీయ విద్యార్థులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో 9 మంది, యూఎస్‌లో 6 మంది, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు మంత్రి వివరించారు.

తక్షణ సహాయం..
ఇక విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత కార్యాలయాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. నేరస్థులకు శిక్ష పడేలా చూస్తాయని పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన వందే భారత్‌ మిషన్, ఆపరేషన్‌ గంగా(ఉక్రెయిన్‌), ఆపరేషన్‌ అజయ్‌(ఇజ్రాయెల్‌) ద్వారా ప్రపంచ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకు వచ్చామని తెలిపారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎంఏడీఏడీ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో భారత ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం 1.33 మిలియన్ల మంది విద్యార్థులు విదేశాల్లోనివిశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నట్లు వెల్లడించారు.