Most Lazy Countries: అనగనగా ఓ ధనవంతుడు.. డాబు, దర్పానికి నిలువెత్తు నిదర్శనం.. వేసుకునే చెప్పుల నుంచి తొడుక్కునే ఉంగరాల దాకా అన్ని అత్యంత ఖరీదైనవే. లంకంత బంగ్లాలో నివాసం ఉంటాడు. కానీ అడుగు తీసి అడుగు పెట్టలేడు. చివరికి కాఫీ కప్పు కూడా నోటికా అందించాలి. సిగరెట్ తాగితే లైటర్ వెలిగించాలి. తినేటప్పుడు అన్నాన్ని నోటిదాకా తీసుకెళ్లాలి. చివరికి చెయ్యి కడిగి, టవల్ తో తుడవాలి. చదువుతుంటే సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాలో ఆహుతి ప్రసాద్ పాత్ర గుర్తుకు వస్తోంది కదూ.. ఇప్పుడు ఎందుకు అతని ప్రస్తావన అంటే.. ఇలాంటి ఆహుతి ప్రసాద్ లు ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే బద్దకాన్ని ఒంటినిండా ఇమడ్చుకున్నారు. వారే కాదు, వారి వల్ల ఆ దేశం కూడా సోమరిపోతు దేశంగా మారిపోయింది.. ఇలాంటి సోమరిపోతు దేశాలకు సంబంధించి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఓ అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది.
గ్లోబల్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పై..
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 46 దేశాల్లో ఏడు లక్షల మంది వ్యక్తుల గ్లోబల్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పై అధ్యయనం చేసింది.. ఆ వ్యక్తుల సమాచారాన్ని సేకరించింది. దాని ఆధారంగా ఈ అధ్యయనం పూర్తి చేసింది. ఈ అధ్యయన వివరాలను నేచర్ జర్నల్ లో ప్రచురించింది. ఈ అధ్యయనంలో వివరాల ప్రకారం ఆయా దేశాల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో భారత్ కూడా ఉండడం విశేషం.
సోమరిపోతు దేశం ఏదంటే..
స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధిక శాతం సోమరిపోతులను కలిగి ఉన్న దేశంగా ఇండోనేషియా అపఖ్యాతిని పొందింది. ఈ దేశంలో ప్రజలు రోజుకు కేవలం 3,513 అడుగులు మాత్రమే నడుస్తారు. అంటే తక్కువగా నడక కలిగిన ప్రజలను కలిగి ఉన్న దేశం ఇది. ఈ దేశంలో రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే.
ద్వితీయ స్థానంలో..
ఇండోనేషియా తదుపరి స్థానంలో సౌదీ అరేబియా దేశం ఉంది. ఈ దేశంలో ప్రజలు 3,807 అడుగులు మాత్రమే రోజుకు నడుస్తారు. ఈ ప్రాంతంలో అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. అందువల్లే ఇక్కడి ప్రజలు తక్కువగా శారీరక శ్రమ చేస్తూ ఉంటారు. చాలామంది వారి వారి గృహాలలోనే ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇండోర్ వ్యాయామశాల లో వ్యాయామాలు చేసేందుకు కూడా ఇష్టపడరు.
తృతీయ స్థానంలో
సౌదీ అరేబియా తర్వాత మలేషియా మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రజలు రోజుకు 3,963 అడుగులు మాత్రమే వేస్తారు. మలేషియాలో పట్టణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నడిచే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
నాలుగో స్థానంలో..
సోమరిపోతుల జాబితాలో ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు సగటున రోజుకు 4,008 అడుగులు మాత్రమే నడుస్తున్నారు. దేశంలో ప్రజలు చాలా తక్కువ చురుకుదనాన్ని కలిగి ఉంటారు. ఈ దేశంలో మనీలా, సెబు వంటి నగరాలలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ దేశంలో సొంత వాహనాల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది..
ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. ఈ దేశంలో ప్రజలు రోజుకు 4,105 అడుగులు వేస్తూ ఉంటారు. భారత్లో ప్రజలు రోజుకు 4,297 అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. మనదేశంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలలో ప్రజలు నడిచేందుకు వీలు ఉండదు. సోమరిపోతుల దేశాల జాబితాలో మన దేశం ఎనిమిదవ స్థానంలో ఉంది. భారత్ తర్వాత మెక్సికో, అమెరికా దేశాలు ఉన్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More