China K Visa: ఏనుగు నెత్తిలో ఎవరూ మన్ను పోయాల్సిన అవసరం లేదు అంటారు. ఎందుకంటే తన తొండంతో తానే మట్టి పోసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలానే ఉంది. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రపంచం మీద పెత్తనం సాగించాలి అనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా విధానాలు ప్రకటిస్తున్నాడు. దానివల్ల అమెరికాకు జరిగే లాభం మాట ఏమిటో గాని.. జరిగే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియా బ్రిక్ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నాయి. చైనా, రష్యా, ఇండియా కలిసి మరో కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవి మర్చిపోకముందే అమెరికాకు మరో పిడుగు లాంటి వార్త ను చైనా అందించింది.
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అమెరికాలో చదవడానికి.. పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలలో స్థిరపడేవారు అమెరికాను ఎంచుకుంటారు. అమెరికా కూడా గతంలో హెచ్ వన్ బి వీసాలను ఉదారంగా ఇచ్చేది. గడచిన అధ్యక్షులు కూడా వీటి విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టేవారు కాదు. అయితే ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత హెచ్ వన్ బి వీసాల విషయంలో తన కర్కశాన్ని ప్రదర్శిస్తున్నాడు. అడ్డగోలు విధానాలతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక రకమైన మందగమనం నెలకొంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఐటీలో కృత్రిమ మేధ రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోతోంది. ఇలాంటి స్థితిలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పెనం నుంచి పోయిలో నెట్టేసినట్టుగా మారుతున్నాయి. అయితే వీటికి చరమగీతం పాడేందుకు చైనా రంగం సిద్ధం చేసింది. మామూలుగా కాదు.. అమెరికా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా వీసా కు డిమాండ్ మామూలుది కాదు. ఆ డిమాండ్ తోనే అమెరికా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రెండవ ఆర్థిక శక్తిగా ఉన్న చైనా సరికొత్త ప్రణాళిక తో ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ఆకర్షించడానికి చైనా కొత్తగా K వీసాను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో స్కిల్ మ్యాన్ ఫోర్స్ కోసం అక్టోబర్ 1 నుంచి ఈ వీసాను అమలులోకి తీసుకురానుంది. నిపుణులు దీనిని యూఎస్ హెచ్1బి వీసాకు పోటీ గా ఉంటుందని పేర్కొంటున్నారు. వీసా ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో.. ఇది చైనాకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.