China-India : అమెరికాతో వాణిజ్య యుద్ధం(Trade war), సుంకాల గొడవలతో ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, చైనా భారత్(China -India)తో సంబంధాలను మెరుగుపరచడానికి సన్నాయి నొక్కులు నొక్కుతోంది. గత కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాలు, గల్వాన్ ఘర్షణలతో కలుషితమైన చైనా–భారత్ సంబంధాలు ఇటీవల కొంత సానుకూల దిశగా సాగుతున్నాయి. కష్టాలు వచ్చే సరికి ‘‘డ్రాగన్–ఎలిఫెంట్ డాన్స్’’ అంటూ భారత్‌తో సహకారానికి పిలుపునిస్తోంది.
Also Read : అమెరికా–చైనా టారిఫ్ వార్.. ముదురుతున్న సుంకాల సమరం!
చైనా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయాలని భావించడానికి అమెరికా(America)తో దిగజారుతున్న ఆర్థిక సంబంధాలే ప్రధాన కారణం. ట్రంప్ ప్రభుత్వం చైనీస్ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తూ, వాణిజ్య ఆంక్షలను కఠినతరం చేస్తోంది. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత, చైనీస్ స్టీల్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్స్(Electronic) వంటి కీలక రంగాలపై సుంకాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, చైనా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌పై దృష్టి సారించింది. 2024లో చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది, భారత్ నుంచి 118 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసింది. ఈ ఆర్థిక ఆధారం చైనాకు భారత్‌తో సహకారం అవసరాన్ని స్పష్టం చేస్తోంది. అంతేకాక, అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ట్రంప్ సుంకాల విధానం వల్ల ఒత్తిడిలో ఉన్నాయి. ఈ సమయంలో చైనా భారత్‌తో దగ్గరవడం ద్వారా అమెరికాకు ఒక సందేశం పంపాలని భావిస్తోంది.
సరిహద్దు శాంతి, సహకారానికి బాట
గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్(BRIKS) సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కీలక మలుపు తీసుకొచ్చింది. ఈ సమావేశంలో లడఖ్ సరిహద్దు వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఒప్పందం కుదిరింది. ఫలితంగా, డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గాయి, రెండు దేశాల సైనికులు వెనక్కి తగ్గాయి. ఈ శాంతి చైనాకు భారత్‌తో ఆర్థిక, దౌత్య సహకారానికి మార్గం సుగమం చేసింది. తాజాగా చైనా సామాజిక మీడియా(Social Media) వీబోలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ‘‘చైనా–భారత్ సంబంధాలు గతంలో కంటే బలంగా ఉన్నాయి. రెండు దేశాలూ సహకారం ద్వారా ప్రపంచ ఆర్థిక వద్ధికి దోహదం చేయగలవు’’ అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చైనా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
భారత్‌కు సాధ్యాసాధ్యాలు
చైనాతో సంబంధాలు మెరుగుపడడం వల్ల భారత్‌కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:
సరిహద్దు శాంతి: గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాలూ సరిహద్దులో సైన్యాన్ని పెంచాయి, ఇది ఆర్థిక భారం. శాంతి కొనసాగితే ఈ ఖర్చు తగ్గుతుంది.
వాణిజ్య అవకాశాలు: చైనీస్ పెట్టుబడులు భారత్‌లోని తయారీ, టెక్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఊతం ఇవ్వగలవు. 2024లో భారత్ చైనాకు 19 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది, ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రపంచ రాజకీయ సమతుల్యం: అమెరికా ఒత్తిడి చేస్తున్న సమయంలో చైనాతో సహకారం భారత్‌కు దౌత్యపరంగా అనుకూలంగా ఉంటుంది. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వంటి వేదికల్లో భారత్ ప్రభావం పెరుగుతుంది. అయితే, ఈ సహకారానికి సవాళ్లు కూడా ఉన్నాయి. చైనా గతంలో భారత్‌పై అనుసరించిన విస్తరణవాద వైఖరి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో పాకిస్తాన్‌తో దగ్గరి సంబంధాలు భారత్‌లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అలాగే, చైనీస్ యాప్‌లపై నిషేధం, భారత్‌లో చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలు వంటి చర్యలు రెండు దేశాల మధ్య విశ్వాస లోటును సూచిస్తున్నాయి.
భవిష్యత్తు ఏమిటి?
చైనా–భారత్ సంబంధాలు సానుకూల దిశగా సాగినప్పటికీ, ఇది కత్తిమీద సాములాంటిదే. రెండు దేశాలూ ఆర్థిక, రాజకీయ సహకారాన్ని కోరుకుంటున్నాయి, కానీ గత అనుభవాలు, విశ్వాస లోటు సవాళ్లుగా మిగిలాయి. చైనా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచడం వెనుక అమెరికాకు వ్యతిరేకంగా ఒక రాజకీయ సందేశం కూడా ఉంది. భారత్ ఈ పరిస్థితిని తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి, అదే సమయంలో అమెరికాతో సంబంధాలను సమతుల్యం చేయడం కీలకం.