https://oktelugu.com/

India vs  Canada : భారతే.. కెనడా మీద వేసేస్తే పోలా.. ఇండియా ఎందుకు వెనక్కి తగ్గాలి?

భారత్‌–కెనడా వివాదం ముదురుతోంది. ఇప్పటికే దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా కెనడా దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఆధారంలేని ఆరోపణలు చేస్తోంది. భారత్‌ సహనాన్ని పరీక్షిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 20, 2024 / 04:34 PM IST

    India-Canada

    Follow us on

    India vs  Canada :  భారత దేశం ఒక ఉమ్మడి కుటుంబం. రాష్ట్రాల, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయం ఉన్నా.. దేశం విషయంలో అంతా ఒక్కటే. మన జోలికి వస్తే ఎవరినీ ఉపేక్షించం. మనకూ మనకూ వంద ఉన్నా.. దేశ రక్షణ విషయంలో అంతా ఒక్కటే. ఈ విషయం మన దాయాది దేశం పాకిస్తాన్‌కు బాగా తెలుసు. ఇక ఇప్పుడు కెనడాకు కూడా ఈ విషయాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతు పలుకుతూ.. ఓ ఉగ్రవాది హత్యను అడ్డం పెట్టుకుని భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది కెనడా. మరో పాకిస్తాన్‌లా కాదు కాదు.. పాకిస్తాన్‌ను మించి కుట్రలు చేస్తోంది. మన సర్జికల్‌ స్ట్రైక్‌ తర్వాత పాకిస్తాన్‌ సైలెంట్‌ అయింది. ఇప్పుడు కెనడాకు కూడా అలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం అనిపిస్తోంది ప్రతీ భారతీయుడికి. భారత్‌లో ఖలిస్తాన్‌ ఉద్యమమే లేదు. కానీ ఖలిస్తాన్‌ పేరుతో భారత్‌లో చిచ్చుపెట్టాలని చూస్తోంది కెనడా. ఇందుకు కెనడాలో స్థిరపడిన భారతీయులను పావుగా వాడుకుంటోంది. సిక్కులను అడ్డంపెట్టుకుని దేశాన్ని చీల్చే కుట్ర చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌ కూడా సిక్కులను రెచ్చగొట్టి కెనడాలోని సిక్కులు నివసించే ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలంటే ట్రూడో అంగీకరిస్తారా.. కానీ, కెనడా అదే చేయాలని చూస్తోంది. సిక్కులతో భారత్‌ను చీల్చాలనుకుంటోంది. ఇది వృథా ప్రయాసే కానీ, భారత్‌పై చేస్తున్న ఆరోపణలే ప్రతీ భారతీయుడికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్తాన్‌ ఇప్పుడు ఉగ్రదాడులతో ఇబ్బంది పడుతోంది. ఇదే తరహాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న కెనడా భవిష్యత్‌లో అదే వేర్పాటువాదంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావొచ్చు. ఈ విషయాన్ని ట్రూడో గమనించడం లేదు. అధికారం కోసం దిగజారి వ్యవహరిస్తున్నారు.

    నిజ్జర్‌ హత్యను అడ్డం పెట్టుకుని…
    ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యను అడ్డ పెట్టుకుని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. హత్య వెనుక భారత హైకమిషనర్‌ ప్రతినిధుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఆధారారాలు అడిగితే మాత్రం స్పందించడం లేదు. తాజాగా దీనిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. సిక్కుల ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిజ్జర్‌ అనే వ్యక్తి కెనడా పౌరుడు కాదు. అనేక దేశాల్లో అతనికి నేర చరిత్ర ఉంది. ఖలిస్తానీ అంతర్గత కలహాలతో హత్యకు గురయ్యాడు. తమ దేశం కాని వ్యక్తి హత్యకు గురైనా కెనడా ప్రధాని ట్రూడో మాత్రం దానిని అడ్డం పెట్టుకుని భారత్‌పై కుట్ర చేస్తున్నాడు. వాస్తవానికి మన దేశం జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టం. చంపే అధికారం కూడా భారత్‌కు ఉంది. భారత్‌ను విడదీయాలనుకునే వ్యక్తిని అసలే ఉపేక్షించం. కానీ, దీనిని పెద్ద సమస్యగా చూపుతున్నాడు ట్రూడో.

    భారతే ఆంక్షలు విధించాలి !
    కెనడా ఓవరాక్షన్‌ను మనమెందుకు భరించాలి. అంతర్గత వ్యవహారల్లో జోక్యం చేసుకుంటున్న ఆ దేశాన్ని ఉపేక్షిస్తే మనమే తప్పు చేసినట్లు అవుతుంది. భారత్‌ జోలికి వస్తే చర్యలు ఎలా ఉంటాయో రుచి చూపించాలి. ఈ క్రమంలో భారత్‌పై ఆంక్షలు విధిస్తామని కెనడానే సంకేతాలిస్తుంది. ఈ తరుణంలో మనమే కెనడాపై ఆంక్షలు ఎందుకు విధించకూడదు. ప్రస్తుతం భారత్‌ ఆంక్షలకు భయపడే దేశం కాదు. ఈ నేపథ్యంలో మనమే కెనడాపై ఆంక్షలు విధించాలి. తప్పు చేయనిచోట మనం తల వంచకూడదు. ఏ దేశం ఆంక్షలు విధించినా ఇరు దేశాలు ఇబ్బంది పడతాయి. 2023–24 మధ్య కాలంలో 8.9 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. కెనడా, భారత్‌ ఎగుమతులు 4.4 బిలియన్‌ డాలర్లు ఉండగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్‌ డాలర్లు. ఇండియాలో కెనడా కంపెనీలు 600లకుపైగా ఉన్నాయి. పెన్షన్‌ ఫండ్‌ పెట్టుబడులు 75 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఆంక్షలు విధిస్తే ఎక్కువగా నష్టపోయేది కెనడానే. ఇక కెనడాలోని సిక్కులు చాలా మంది భారతీయులు. కొద్ది మంది మాత్రమే ఖలిస్తానీ మద్దతుదారులు. భారత్‌తో కయ్యం పెట్టుకుంటున్న ట్రూడోకు వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి భారతీయ సిక్కులు కూడా బుద్ధి చెప్పడం ఖాయం.

    ఆత్మగౌరవమే అసలైన సంపద
    భారత్‌కు ఆత్మగౌరవమే అసలైన సంపద. దీనిని ఎవరు దెబ్బతీయాలని చూసినా భారతీయులు ఉపేక్షించరు. ఆక్షంలు విధిస్తే ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతాయని ఎవరూ భయపడరు. భారత్‌ స్పందిస్తే.. కెనడాతోపాటు ఆ దేశాలకు మద్దతు ఇస్తున్నవారికి కూడా వణుకు పుట్టాలి. భారత్‌ జోలికి పోవద్దని అనుకునేలా ఉండాలి.