Sai Chand Passed Away: అతడు పాట పాడితే సబ్బండవర్ణాలు లయబద్ధంగా ఆడేవి. అతడు గజ్జె కట్టి ఆడితే ముల్లోకాలు ఊగేవి. ఆగడి గొంతులో ఏ మాధుర్యం ఉందో తెలియదు కానీ.. ఆబాల గోపాలం తెలంగాణ పదం అందుకునేది. అతని ఆటలో ఎంతటి మహత్తు ఉందో తెలియదు కానీ ఊరువాడ సయ్యాటలాడేది. ధూం ధాం, అలయ్ బలయ్.. ఒకటా రెండా ఎన్ని ఉద్యమ వృత్తాంతాలు ఉంటే.. అందులోనూ తను ఉండేవాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తనదైన శైలిలో జనానికి చాటి చెప్పేవాడు. తెలంగాణ ఎందుకు రావాలో ఘంటాపథంగా వివరించేవాడు. అలాంటి ఉద్యమానికి ఊపిరిలు ఊదినవాడు, తెలంగాణ సమాజాన్ని జాగృత్తపరిచే బాధ్యతను తలకు ఎత్తుకున్న వాడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి కుప్పకూలిపోయాడు. తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా పూర్తి కాలం పని చేయకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ వి సాయిచంద్ హఠాన్మరణం చెందాడు. 39 సంవత్సరాల వయసు ఉన్న సాయి చంద్ వారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడు.. వెళ్తున్నప్పుడు తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేశాడు. బుధవారం అర్ధరాత్రి పూట చాతిలో మంట రావడంతో మొదట గ్యాస్ సమస్య అనుకున్నాడు. ఏదో టాబ్లెట్ ఉంటే వేసుకుని పడుకున్నాడు. నొప్పి ఎంతకు తగ్గకపోవడంతో విలవిలలాడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాదులోని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ సాయి చంద్ కన్నుమూశాడు. సాయి చంద్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సాయి చంద్ మహ బూబ్ నగర్ జిల్లాలో రూపాల్లో స్వరాష్ట్ర కాంక్షను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవాడు. కళాకారులతో తెలంగాణ ఆవశ్యకతను వివరించేవాడు.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళారూపాల ద్వారా చాటి చెప్పేవాడు. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పంథా లో తీసుకెళ్తుండడంతో కెసిఆర్ దృష్టిలో పడ్డాడు.. తెలంగాణ ఉద్యమం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పోలీసు లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. కేసులు కూడా ఎదుర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతడికి నాగర్ కర్నూల్ సీట్ ఇస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులపాటు ఇతడు భారత రాష్ట్ర సమితికి దూరంగా ఉన్నాడు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ పిలిపించి తెలంగాణ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాడు. వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ శాసనసభ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగానే సాయిచంద్ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశాడు. ఇక ఇతడి మృతిపై ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటి ఆర్ సంతాపం తెలిపారు. పార్టీ పరంగా అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే గుండెపోటుతో సాయిచంద్ కన్నుమూయడం బాధాకరమని వారు విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతితో నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.