Birth Rate Increases In Japan: పని.. పని.. పని.. ఇది మాత్రమే జపాన్ దేశస్థులకు తెలుసు. అందువల్లే ప్రపంచంలోనే అత్యంత ఉత్పాదకత సాధించే దేశంగా జపాన్ పేరు తెచ్చుకుంది. సాంకేతిక రంగాలలో జపాన్ దేశం ప్రపంచమే ఆశ్చర్యపోయే పురోగతిని సాధించింది. ఉన్నపాటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అచంచలమైన ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకుంటున్నది జపాన్. జపాన్ దేశంలో చదువుకున్న యువత కంటే వృద్ధులు ఎక్కువగా ఉంటారు. దానికి కారణం అక్కడ ఫెర్టిలిటీ రేటు తగ్గిపోవడమే.
ఫెర్టిలిటీ రేటు తగ్గడం వల్ల అది జపాన్ వృద్ధి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు అక్కడ సగటు జీవితకాలం ఎక్కువగా ఉండటంతో వృద్ధుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కేవలం పని మీద దృష్టి సారించడంతో అక్కడి యువత వివాహాలు కూడా చేసుకోవడం లేదు. ఒకవేళ వివాహాలు చేసుకున్నా సరే దాంపత్య జీవితం మీద పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో జపాన్ దేశం తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నది. అన్ని దేశాలు ఆర్థికంగా.. ఇతర సమస్యలతో బాధపడుతుంటే.. అక్కడ సంతాన లేమి సమస్య ఆ దేశాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. ఈ నేపథ్యంలోనే జపాన్ దేశానికి చెందిన ఇటోచు కార్ప్ కంపెనీ ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టింది.
పనిలో ఉత్పాదకతను పెంచడానికి ఇటోచు కార్ప్ కంపెనీ నైట్ షిఫ్ట్ మొత్తాన్ని నిషేధించింది. దీంతో ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఉత్పాదకత అద్భుతమైన స్థాయిలో పెరిగింది. లాభాలు కూడా ఊహించని స్థాయిలో వచ్చాయి. అంతేకాదు నైట్ షిఫ్ట్ నిషేధించడం వల్ల ఆ కంపెనీలో పనిచేసే మహిళల ఫెర్టిలిటీ రేటు కూడా రెట్టింపు అయింది. ఒక ఉద్యోగిని ఇద్దరు పిల్లల్ని కన్నారు. అదే కాదు కొద్ది రోజులైనా తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ పరిణామాన్ని గుర్తించిన ఆ కంపెనీ ఓవర్ టైం ను కూడా తగ్గించింది. పనిగంటలను 6 గంటలకు కుదించింది. ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న నేపథ్యంలో.. మిగతా కంపెనీలు కూడా ఇదే దారిలో అనుసరిస్తున్నాయి.
కొంతకాలంగా జపాన్ దేశంలో బర్త్ రేటు దారుణంగా పడిపోయింది. దీంతో ఆ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. బర్త్ రేట్ 2.1 ఉండాల్సి ఉండగా.. అది 1.3 కి మాత్రమే పరిమితమైంది. దీంతో అక్కడ అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటోచు కార్ప్ అనే కంపెనీ తీసుకున్న నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతో.. మిగతా కంపెనీలు కూడా అదే దారిని అనుసరిస్తున్నాయి. జపాన్ దేశంలో గనుక బర్త్ రేటు పెరిగితే ఆర్థిక అభివృద్ధి మరింత విస్తృతమవుతుందని అంచనాలు ఉన్నాయి..