Joe Biden: బైడెన్‌కు కొత్త తలపోటు మొదలైంది. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి నమ్మకమైన దోస్తులైన సౌదీ అరేబియా,ఇజ్రాయిల్ దేశాలు ఝలక్‌లిస్తున్నాయి. తమ డిమాండ్ల పద్దులు,ఒప్పందాల చిట్టాలు ముందు పెట్టి తీర్చాలంటూ.. పట్టుబడుతున్నాయి. లేకపోతే అమెరికా అధ్యక్ష్యుడు బైడెన్ మాట వినేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో అటు ఇజ్రాయిల్ ఇటు సౌదీని దారికి తేవడమేలా..? అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వెరసి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతికుతూ.. ఇజ్రాయిల్,సౌదీల మధ్య రాజీ కుదిర్చేందుకు బైడెన్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు.
పశ్చిమాసియాలో అమెరికా,దాని మిత్ర దేశాలకు నమ్మకమైన దేశాలు ఎవైనా ఉన్నాయంటే మొదటగా చెప్పుకోవాల్సింది సౌదీ అరేబియా,ఇజ్రాయిల్ గురించే. అయితే వెస్ట్ ఏషియాలో ఇంతటి కీలకమైన దేశాల మధ్య సఖ్యత కుదర్చడమే అమెరికాకు చాన్నాళ్లుగా తలకు మించిన భారంగా మారుతోంది. ఈ రెండు దేశాలు రెండు విభిన్న మత సంప్రదాయాలు,సంస్కృతులకు చెందిన దేశాలు కావడమే ఇందుకు తార్కాణం. అయితే గతేడాది అమెరికా అధ్యక్షులు జో బైడెన్ చేసిన ప్రయత్నాల కారణంగా ఇజ్రాయిల్,సౌదీ అరేబియాల మధ్యన అంగీకారం కుదిర్చేందుకు అవకాశం ఏర్పడింది. ఈనేపథ్యంలోనే గతేడాది అక్టోబర్ 07న హమాస్ ఇజ్రాయిల్ పై అనూహ్యంగా దాడి చేయడం ఆ వెంటనే..ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై యుద్ధానికి దిగడం..యూఎస్‌కు తలనొప్పిగా మారింది. వాస్తవానికి చాన్నాళ్లుగా అమెరికా చేసిన ప్రయత్నాల కారణంగా ఇజ్రాయిల్,సౌదీ అరేబియా మధ్యన సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు అవకాశం ఏర్పడినప్పటికీ..హమాస్-ఇజ్రాయిల్ మధ్యన నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా అమెరికాకు రెండు దేశాలను దారికి తెచ్చుకోవడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
అమెరికా ఛాన్నాళ్ల క్రితమే ఇజ్రాయిల్,సౌదీ అరేబియాలకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. సౌదీ చెబుతున్నట్లు పాలస్తీనా అనే దేశాన్ని ఇజ్రాయిల్ అధికారికంగా గుర్తించాలని కోరుతోంది. అలాగే సౌదీ సైనికంగా ఎదిగేందుకు అమెరికా అందించే సహకారంపై అభ్యంతరం చెప్పకూడదని చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కర్బన ఉద్గారాలకు కారణమైన పెట్రోల్,డిజీల్ ఇందనాల వాడకాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. అదే జరిగితే చమురు ఉత్పత్తులపై ఆధారపడిన తమలాంటి దేశాలకు భవిష్యత్ లో ఇక్కట్లు తప్పవని సౌదీ భావిస్తోంది. అందువల్ల అమెరికా వంటి దేశాల సహకారంతో టూరిజం,ఇతర మెగా ప్రాజెక్టుల రూపకల్పనకు సౌదీ ప్రణాళికలు రచించుకుంటోంది. వీటన్నింటికి ఇజ్రాయిల్ అడ్డుపుల్ల వేయకుండా అమెరికా ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదర్చాలని భావిస్తోంది. ఇక ఇజ్రాయిల్ విషయానికొస్తే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు నేతన్యాహు అస్సలు అంగీకరించడం లేదు. సౌదీకి టెక్నాలజీ,శాస్త్ర,సాంకేతిక రంగాల్లో సహకారానికి ఒకే కానీ..ఆ దేశం చెబుతున్నట్లు తాము రఫాపై యుద్ధాన్ని ఆపబోమని కూడా తేల్చి చెబుతోంది. అక్కడున్న వారు ఇతర ప్రాంతాలకు తరలి ళ్లాల్సిందేనని తెగేసి చెబుతోంది ఇజ్రాయిల్.
ఈనేపథ్యంలోనే ఈరెండు దేశాలను దారికి తెచ్చుకోవడమేలా అనే అంశంపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్,లెబనాన్,సిరియా,హౌతీ,యెమన్‌ల నుంచి అమెరికాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయా దేశాలు రష్యా,చైనాల మద్దతుతో యూఎస్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇలాంటి తరుణంలో వెస్ట్ ఏషియాలో అమెరికాకు ఆప్త మిత్రులుగా ఉన్న సౌదీ,ఇజ్రాయిల్‌లను అమెరికా ఎలా ఏకతాటిపైకి తెస్తోందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.