Bangladesh Protests: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాపలాదారులుగా పని చేయాలి. ప్రజల భద్రతకు, సంక్షేమానికి, దేశ అభివృద్ధికి పెద్దపీట వేయాలి. అంతేతప్ప అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు కర్రి కాల్చి వాత పెడతారు. పోలీసుల బలం చూసుకుని, సైన్యం అండ చూసుకొని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తే ప్రజలు చుక్కలు చూపిస్తారు. పాలకులను దేశం వదిలి పారిపోయేలా చేస్తారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రజల్లో చెలరేగిన అశాంతిని అంచనా వేయలేక మూర్ఖంగా ప్రవర్తించారు. దాని ఫలితాన్ని ఇప్పుడు ఆమె అనుభవిస్తున్నారు. ఆమె కాదు సరిగ్గా రెండేళ్ల క్రితం శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజ పక్సే కూడా ఇలాంటి పరిస్థితినే చవిచూశారు.. ఏకంగా దేశం వదిలి వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన దేశం వదిలి వెళ్ళిపోయినప్పుడు.. రాజా పక్సే అధికారిక నివాసాన్ని ప్రజలు చుట్టుముట్టారు. అందులోకి ప్రవేశించి విధ్వంసాన్ని సృష్టించారు. తమలో గూడు కట్టుకున్న అగ్రహాన్ని ఒక్కసారిగా వివిధ రూపాలలో వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ లో..
బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. అల్లరిమూకలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏం చేయాలో పాలు పోక పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. దోపిడీలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతుండడంతో అవి సర్వనాశనం అవుతున్నాయి. ప్రవేట్ ఆస్తుల్లో దోపిడీకి పాల్పడి, అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో అల్లరి మూకలు చొరబడి దొరికిన వస్తున్న దొరికినట్టే దోచుకుంటున్నాయి. వారి వెంట తెచ్చుకున్న వాహనాలలో తరలిస్తున్నాయి. ఇంత దౌర్జన్యం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ.. అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి హసీనా తన పదవిని తృణప్రాయంగా త్యజించారు. ప్రత్యేక విమానంలో పొరుగున ఉన్న ఇండియాకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు.
విధ్వంసాన్ని సృష్టించాయి..
అల్లరి మూకలు బంగ్లాదేశ్ లో మరింత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధానమంత్రి అధికార నివాస భవనమైన గణ భాబన్ లోకి ప్రవేశించారు. అనంతరం అక్కడ పెను విధ్వంసం సృష్టించారు. ఇంట్లో ఉన్న వస్తువులను తస్కరించారు. మాంసాన్ని వండుకొని తిన్నారు. చేపలను ఎత్తుకెళ్లారు. చివరికి కూరగాయలను కూడా వదలలేదు. విలాసవంతమైన ఫర్నిచర్ ను తస్కరించారు.. ప్రధాని పడుకునే మంచంపై కొందరు ఆందోళనకారులు ఎగిరి గంతులు వేశారు. ఈ దృశ్యాలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు . అయితే ఇందుకు సంబంధించిన వార్తలను కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో.. ఒక్కసారిగా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
అశాంతికి ఇదీ కారణం
బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ దేశంలో మంటలు రాజేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత అద్వానంగా మారింది. ఆందోళనకారులు దేశంలో అశాంతి పరిస్థితులను సృష్టించడంతో అల్లకల్లోలం ఏర్పడింది. సామాన్య మనుషులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. స్కూళ్లకు నిరవధికంగా సెలవులు ఇచ్చారు. కళాశాలలు మూసివేశారు. బంగ్లాదేశ్లో చేపల వేట పై నిషేధం విధించారు. ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గి ముఖం పట్టడం లేదు.
2018లో అమలు చేయాలనుకున్నప్పటికీ..
వాస్తవానికి ఈ బిల్లును 2018లో అమలు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అయితే అప్పట్లో విద్యార్థులు తీవ్రస్థాయిలో తమ అగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఇటీవల జూన్ నెలలో ఈ కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మధ్యలో కొద్ది రోజులు గొడవలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఆదివారం మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. నిరవధిక కర్ఫ్యూను మొదలుపెట్టింది. అయితే ఆ కర్ఫ్యూను చేదించుకుంటూ వచ్చిన ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. ప్రధానమంత్రి అధికారిక నివాస భవనాన్ని బూత్ బంగ్లా లాగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.
రేపు ఏ దేశం..
ప్రజల మన్ననలు పొందని ఏ ప్రభుత్వానికైనా పరిపాలించే హక్కు లేదు. దీనిని నిజం చేసే సంఘటనలు ఈ ప్రపంచంలో చాలా జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. చైనాతో అంట కాగి దేశాన్ని సర్వభ్రష్టం చేసినందుకు శ్రీలంక ఒకప్పటి అధ్యక్షుడు రాజపక్సే ను అక్కడి ప్రజలు తరిమి తరిమి కొట్టారు. నచ్చని చట్టాన్ని నెత్తిమీద రుద్దినందుకు బంగ్లాదేశ్ ప్రజలు ఆ దేశ అధ్యక్షురాలిని బయటికి పంపించారు.. మనదేశంలోనూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అప్పట్లో రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.. స్థూలంగా చెప్పాలంటే ప్రజల కోణంలో పరిపాలించని ఏ ప్రభుత్వాన్నయినా సరే ప్రజలు క్షమించడం లేదు. వారి నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిక్క రేగితే తరిమి తరిమి కొడుతున్నారు.
“Protestors” occupied the PM house in #Bangladesh after sitting PM with 2/3rd majority Shaikh Haseena had to flew from the country.
The ideal democracy of Left lobby…. pic.twitter.com/5QHDeqIq0o
— Mr Sinha (@MrSinha_) August 5, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More