Bangladesh Political Crisis: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ తిరుగుబాటు సంక్షోభం అలుముకుంది. తాత్కాలిక ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు. గత 9 నెలల్లో బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంక్షోభం రావడం ఇది రెండోసారి. గతేడాది ఆగస్టులో కూడా బంగ్లాదేశ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. అప్పుడు విద్యార్థి ఉద్యమాల కారణంగా షేక్ హసీనా అధికారం నుంచి వైదొలగడం వరకు చాలా సంఘటనలు జరిగాయి. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్‌ను ప్రస్తుత స్థితికి చేర్చిన కొన్ని సంఘటనలు చూద్దాం.
తిరుగుబాటు ఎలా మొదలైంది?
2024 జూలైలో యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ వ్యవస్థ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్ ఇస్తుందని, దీనివల్ల ఇతర విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని వారు భావించారు. మొదట్లో ఈ నిరసనలు శాంతియుతంగానే సాగాయి. కానీ ప్రభుత్వం విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంతో అవి హింసాత్మక ఘర్షణలుగా మారాయి.
* 2024 జూలై 1: విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి, రోడ్లు , రైల్వే మార్గాలను దిగ్బంధించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
* 2024 జూలై 16: నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య హింస చెలరేగింది. ఇందులో ఇరువర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో హింస మరింత వేగంగా వ్యాపించింది.
* 2024 జూలై 18: నిరసనకారులు బంగ్లాదేశ్ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. అన్ని చోట్ల నిరంకుశ పాలకుడిని తొలగించండి అనే నినాదాలు మార్మోగాయి. అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఈ సమయానికి హింసలో 32 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
* 2024 జూలై 21: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కోటా వ్యవస్థను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అయితే, 1971 నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలను పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో వారు సంతృప్తి చెందలేదు.
* 2024 ఆగస్టు 5: నిరసనకారులు షేక్ హసీనా నివాసంపై దాడి చేశారు. దీంతో ఆమె భారతదేశానికి పారిపోయి వచ్చారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి దీనికి సంతోషం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో మళ్లీ తిరుగుబాటు పరిస్థితులు కనిపిస్తున్నాయా?
షేక్ హసీనా అధికారం నుంచి వైదొలగిన దాదాపు ఏడాది తర్వాత మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కూడా సంక్షోభంలో ఉంది. రాజకీయ పార్టీలు సంస్కరణలను ఆమోదించకపోతే తాను రాజీనామా చేస్తానని యూనుస్ బెదిరించారు. గతేడాది విద్యార్థి ఉద్యమాల నుంచి ఉద్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు నాహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. రాజకీయ మద్దతు లేకుండా యూనుస్ పని చేయడం కష్టంగా మారిందని అన్నారు. ”
బంగ్లాదేశ్‌లో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడానికి యూనుస్ అధికారంలోకి వచ్చారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ పెద్దగా ఏమీ మారలేదు కాబట్టి ఆయన పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. “ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే ప్రజలు ఆందోళన చేయలేదని, వ్యవస్థను మార్చడానికి చేశారని మేము ఆయనకు స్పష్టంగా చెప్పాము. సంస్కరణలు లేకుండా ఎన్నికలకు అర్థం లేదు” అని నాహిద్అన్నారు.
యూనుస్‌పై పెరుగుతున్న ఒత్తిడి:
హసీనా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత యూనుస్ కీలక రంగాలలో పెద్ద సంస్కరణలను చేపడానని వాగ్దానం చేశారు. కానీ అంతర్గత రాజకీయాల వల్ల ఆయన అలా చేయలేకపోయారు. ఇటీవల ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మద్దతుదారులు యూనుస్‌కు వ్యతిరేకంగా మొదటి పెద్ద నిరసనను నిర్వహించారు. అందులో వారు వీలైనంత త్వరగా ఎన్నికల తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తర్వాత ఏంటి ?
నేడు బంగ్లాదేశ్ ఒక క్లిష్టమైన మలుపులో నిలబడి ఉంది. యూనుస్ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయలేకపోతే దేశం మళ్ళీ అదే సంక్షోభంలో చిక్కుకుపోవచ్చు. దాని నుంచి అది బయటపడటానికి ప్రయత్నిస్తోంది. మధ్యంతర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల అంతర్గత రాజకీయాలు బంగ్లాదేశ్‌ను కొత్త సమస్యల వైపు నెట్టివేస్తున్నాయి.