America: అగ్రరాజ్యం అమెరికాలో.. భారతీయులకు రక్షణ కరువవుతోంది. మొన్నటి వరకు భారతీయుల షాపులే లక్ష్యంగా దాడులు, చోరీలు జరిగాయి. కాలుపలు జరిపి హత్యలు చేశారు. మరికొన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఇప్పుడు హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. స్వామి నారాయణ్ ఆలయం వద్ద కాల్పులు జరిపారు. గుడిని దుండగులు స్వల్పంగా ధ్వసం చేశారు. తాజాగా టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలో హిందూ దేవతలను అవమానించే విధంగా కొన్ని వ్యక్తులు చేసిన చర్య అమెరికాలో ఆందోళన సృష్టించింది. ముసుగు ధరించిన కొంతమంది వ్యక్తులు హిందూ దైవాలను లక్ష్యంగా చేసుకుని, ద్వేషపూరిత నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఆ బోర్డులపై ‘‘భారత రాక్షసులను తిరస్కరించండి’’, ‘‘నా టెక్సాస్‌ను ఇండియాగా మార్చొద్దు’’, ‘‘హెచ్1–బీ మోసగాళ్లను దేశంలోకి రానివ్వకుండా చేయండి’’ వంటి వ్యాఖ్యలు ఉన్నాయని సమాచారం. బోర్డులపై విష్ణు, వినాయకుడు వంటి దేవతలను అవమానించేలా చూపించడం స్థానిక హిందూ ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
‘టేక్ యాక్షన్ టెక్సాస్’ అకౌంట్‌పై తీవ్ర విమర్శలు
ఈ ఘటనను తొలుత వెలుగులోకి తెచ్చిన ‘టేక్ యాక్షన్ టెక్సాస్’ అనే ఎక్స్ ఖాతా గతంలోనూ హిందువులపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. దీపావళిని ‘‘రాక్షస పండుగ’’గా పేర్కొంటూ హిందూ ఆచారాలను ద్వేషపూరితంగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ బ్యానర్ ప్రదర్శన కూడా అదే సమూహం ప్రేరేపణగా ఉన్నదని అనుమానం వ్యక్తమవుతోంది.
చర్యలకు హిందూ సంస్థల పిలుపు
ఉత్తర అమెరికా హిందూ సంఘాల సమాఖ్య ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, హిందువుల భద్రతను ప్రభుత్వ స్థాయిలో నిర్ధారించాలని టెక్సాస్ అధికారులను కోరింది. వారి ప్రకటనలో, ‘‘ఇలాంటి ద్వేషపూరిత చర్యలు మతసభ్యతను దెబ్బతీస్తూ, చిన్న వర్గాల ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
విస్తరిస్తున్న హిందూ ఫోబియా
ఇది ఒక్క సంఘటన కాదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి దేశాల్లోనూ భారత మూలాలున్న ప్రజలపై వివక్ష, కక్షాత్మక చర్యలు పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో హిందూ విశ్వాసాలపై వ్యంగ్యాలు, అపనిందలు సాధారణమవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టెక్సాస్ ఘటన బహుళమత దేశమైన అమెరికాలో సహజీవనానికి సవాల్‌గా మారింది. ఈ తరహా చర్యలు మతాంతర సమతుల్యతను దెబ్బతీస్తూ కొత్త విభజనల విత్తనాలు వేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్వేషపూరిత ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ ధోరణి మరింతగా విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టెక్సాస్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన హిందూ సమాజంపై పెరుగుతున్న విద్వేషాన్ని మళ్లీ బయటపెట్టింది. ప్రజాస్వామ్య దేశాల్లో మతపరమైన గౌరవం రక్షించబడాలంటే చట్టపరమైన చర్యలతో పాటు సామాజిక అవగాహన కూడా అత్యవసరం. వివిధ మతాలు, సంస్కృతుల మధ్య పరస్పర గౌరవమే శాంతి సమాజానికి శాసనం అని ఈ ఘటన గుర్తుచేస్తోంది.